Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్రతో టీడీపీకి పోలిటికల్ మైలేజ్ ఎంత...?

నారా లోకేష్ తెలుగుదేశం భావి నాయకుడు. తన నాయకత్వానికి పార్టీలో ఎక్కడా పోటీ పేచీ లేని అదృష్టవంతుడు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 11:48 AM GMT
లోకేష్ పాదయాత్రతో టీడీపీకి పోలిటికల్ మైలేజ్ ఎంత...?
X

నారా లోకేష్ తెలుగుదేశం భావి నాయకుడు. తన నాయకత్వానికి పార్టీలో ఎక్కడా పోటీ పేచీ లేని అదృష్టవంతుడు. చంద్రబాబుకు మరో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి పార్టీలో పెద్ద ఎత్తున కాంపిటేషన్ ఉండేది. అలా చంద్రబాబు ఎన్నో వ్యూహాలను అమలు చేసుకుని చివరికి సీఎం అయ్యారు. పార్టీ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. కానీ లోకేష్ కి అలాంటి ఇబ్బంది లేదు. సోలోగా టీడీపీ నాయకత్వం మీద ఆయనకు వారసత్వం సునాయాసంగా వచ్చేసింది.

దాన్ని ఆయన ఎంతవరకూ నిలబెట్టుకుంటారు అన్నది ఒక ప్రశ్న అయితే ఆయన వల్ల టీడీపీ ఎంతవరకూ పటిష్టంగా మారుతుంది అన్నది మరో కీలక అంశం. ఏపీలో చంద్రబాబు ఏడున్నర పదుల వయసులో ఉన్నారు. ఆయనకు దాదాపుగా ఈ ఎన్నికలు చివరివి అని అంటున్నారు. మరో ఎన్నిక టైం కి బాబుకు ఎనభయ్యేళ్ళు వచ్చేస్తాయి.

పైగా లోకేష్ కి వారసత్వం అప్పగించాలి. అంటే మరో మాటలో అధికారం ఇవ్వాలి. అందుకోసమే చంద్రబాబు తపన పడుతున్నారు. అయితే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో గండర గండలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో ప్రవేశించి అక్కడ మంత్రి పదవిని అందుకోవడం మామూలు విషయం కాదు. అలాగే టీడీపీ ఎంత మామగారిదైనా అక్కడ ఉన్న ఉద్ధండులను చేదించుకుని వచ్చి పార్టీలో నంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడం తేలికైన వ్యవహారం కాదు.

అలా కనుక చూసుకుంటే చంద్రబాబు ఢక్కామెక్కీలు తిన్న రాజకీయవేత్త. కాకపోతే వైఎస్సార్ నుంచి జగన్ దాకా అదే దూకుడు ఆయన కంటిన్యూ చేయలేరు. ఇక ఏపీలో చూస్తే జగన్ బలంగా ఉన్నారు. అలాగే పవన్ కూడా రాజకీయంగా చురుకైన పాత్ర రానున్న కాలాలలో చేస్తారు వీరికి ధీటుగా లోకేష్ తయారు కావాలనే పాదయాత్రకు బాబు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికి లోకేష్ 200 రోజుల పాదయాత్రను పూర్తి చేశారు. అలాగే రెండు వేల 700 కిలోమీటర్లు నడిచారు ఇక ఉమ్మడి ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే అందులో సగానికి పైగా ఎనిమిది జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర పూర్తి అయింది. రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా జిల్లాలను దాటి లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పోలవరంలో ఉండగా 200 రోజుల మైలురాయిని దాటారు.

మంచిదే కానీ లోకేష్ పాదయాత్ర ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగడంలేదు. గతంలో వైఎస్సార్ పాదయాత్ర చేస్తే ఆ ఇంపాక్ట్ నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మీద గట్టిగా పడింది. ప్రభుత్వం మారడం తధ్యమన్న భావన కల్పించింది. ఇక జగన్ 2017లో పాదయాత్ర చేపడితే ఆ ప్రభావం చంద్రబాబు సర్కార్ మీద పెను ప్రభావం చూపించింది.

అలాగే లోకేష్ పాదయాత్ర కూడా మారుతుందని ఎంతో ఆశపడినా అది ఫలించడంలేదు. అక్కడడక్కడ మెరుపులు తప్ప పాదయాత్ర అలా సాఫీగా సాగిపోతోంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను పెంచె విధంగా పాదయాత్ర అయితే లేదని అంటున్నారు. చిత్రమేంటి అంటే లోకేష్ పాదయాత్రలో ఎక్కువగా కార్యకర్తలు పాల్గొంటున్నారు అని అంటున్నారు. సాధారణంగా పాదయాత్రలు హిట్ కావాలీ అంతే సాదర జనం ఎక్కువగా పాల్గొనాలి. కానీ టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి కార్యకర్తలతో లోటు లేకుండా లోకేష్ పాదయాత్ర జరుగుతోంది.

ఇక లోకేష్ లోకల్ గా ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యేలను తన సభలలో విమర్శిస్తూ వస్తున్నారు. అక్రమాలు అవినీతి అంటున్నారు. అయితే వాటిని జనాలు పెద్దగా పట్టించుకోవడంలేదు. అదే టైం లో లోకేష్ ని పిల్ల కాకి అని, ఏమీ తెలియదు అని చంద్రబాబు కొడుకు అన్న హోదా తప్ప తాను స్వయంగా సాధించింది ఏముంది అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు గట్టిగా ఎటాక్ చేస్తున్నారు. పైగా మంగళగిరిలో ఓడిపోయారని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి లోకేష్ తానుగా ఏదైనా సాధించి పాదయాత్ర లాంటివి చేస్తే ఆ ఊపు బాగా ఉండేదన్న చర్చ కూడా ఉంది. అయితే లోకేష్ పాదయాత్ర ద్వారా ఒక విషయంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇతర్ పార్టీలకు బయట జనాలకు ఆయన ఏ విధంగా కనిపించినా టీడీపీ వారికి మాత్రం చంద్రబాబు తరువాత వారసుడు అతనే అని ఎస్టాబ్లిష్ చేయగలిగారు అని అంటున్నారు.

అదే విధంగా లోకేష్ గతం కంటే కూడా తన ప్రసంగాలను మెరుగుపరచుకున్నారు. అలా పార్టీలో తన స్థానాన్ని మెరుగుపరచుకున్నారు తప్ప టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు సరిపడా పొలిటికల్ మైలేజ్ అయితే పెద్ద ఎత్తున తీసుకుని రాలేకపోయారు అని అంటున్నారు. ఇక మిగిలినవి నాలుగైదు జిల్లాలు. లోకేష్ ఏమైనా అద్భుతాలు సృష్టిస్తారా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.