భారతీయ సీఈవోలకు కష్ట కాలం.. స్టార్ బక్స్ లో వేటు.. తదుపరి పిచయ్?
ఒక్కొక్కటిగా కంపెనీలు భారతీయ సీఈవోలను తొలగిస్తుండడమే దీనికి కారణం.
By: Tupaki Desk | 15 Aug 2024 9:52 AM GMTఒక్కొక్కరుగా భారతీయులు ప్రపంచ దిగ్గజ కంపెనీలకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ( సీఈవో)లు అవుతుంటే.. ప్రతి భారతీయుడూ గొప్పగా ఫీలయ్యారు.. తామే ఆ పదవిలోకి వచ్చినంత సంబరపడ్డారు. వేల కోట్ల కార్పొరేట్ ప్రపంచానికి మన ప్రతిభ గురించి తెలిసిందని గర్వించాం.. అయితే, ఇప్పుడు అంతా వెనక్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా కంపెనీలు భారతీయ సీఈవోలను తొలగిస్తుండడమే దీనికి కారణం.
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన స్టార్ బక్స్ కు సీఈవోగా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ ను ఆ సంస్థ తొలగించింది. ఆయన స్థానంలో బ్రయాన్ నికోల్ కు బాధ్యతలు అప్పగించింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టార్ బక్స్ కు గత ఏడాదే నరసింహన్ సీఈవో అయ్యారు. సహజంగా ఇంత పెద్ద సంస్థల్లో కీలక పదవుల్లోకి వచ్చేవారికి కాస్త ఎక్కువ వ్యవధే ఉంటుంది. కానీ, ఏడాదికే నరసింహన్ సీఈవో, స్టార్ బక్స్ బోర్డు నుంచి వైదొలగడం గమనార్హం.
సవాళ్లను ఎదుర్కొనలేరనా?
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే మనస్తత్వం, క్లిష్ట పరిస్థితుల నుంచి సంస్థలను బయటపడేయగలరన్న ధీమా భారత సీఈవోలపైన ఉంది. అలాంటిది స్టార్ బక్స్ మాత్రం నరసింహన్ ను సాగనంపింది. దీనివెనుక ఆ సంస్థ పరిస్థితే కారణమనే తెలుస్తోంది. ఇప్పటికే అమ్మకాల్లో తీవ్ర క్షీణతను చూసిన స్టార్ బక్స్ కు చైనా మార్కెట్ చుక్కుల చూపిస్తోంది. వినియోగదారుల బలహీన సెంటిమెంట్ కు తోడు అక్కడి తీవ్ర పోటీని తట్టుకోలేకపోతోంది. దీంతో నరసింహన్ పదవికి ఎసరు పెట్టింది.
వీ వర్క్ నుంచి... ట్విటర్ వరకు
ఇటీవలి కాలంలో నిష్క్రమించిన భారతీయ సీఈవోలు నరసింహన్ ఒక్కరే కాదు. ఈయనకు మందు గత ఏడాది ఏప్రిల్ లో వీ వర్క్ సందీప్ మత్రానీ వైదొలగారు. 2021 నవంబరులో ట్విటర్ లో ఏం జరిగిందో అందరూ చూశారు. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలుతో ‘ఎక్స్’గా పేరు మారిన ఈ సంస్థకు అప్పటికి అధిపతి పరాగ్ అగర్వాల్. కానీ, మస్క్ తో విభేదాల నేపథ్యంలో ముందే ఆయన తప్పుకొన్నారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయం అయింది.
తదుపరి పిచయ్ యేనా?
గూగుల్ కు కొన్నేళ్లుగా సీఈవోగా ఉన్నారు సుందర్ పిచయ్. ఇప్పుడు ఈయన కూడా నిష్క్రమిత భారతీయ సీఈవోల జాబితాలో చేరనున్నట్లు తెలుస్తోంది. సుందర్ నాయకత్వంలో గూగుల్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ,ఏఐలో కంపెనీ ఆపసోపాలు పడుతోంది. ఈ రంగంలో ముందుకెళ్లాలంటే సుందర్ ను తొలగించాలంటూ పెట్టుబడిదారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన రాజీనామా చేయవచ్చని లేదా త్వరలో వేటుకు గురికావొచ్చని కొందరు పరిశీలకులు పేర్కొంటున్నారు.
పరిస్థితిని చాటుతున్న నరసింహన్ ఇంటర్వ్యూ
నరసింహన్ నిష్క్రమణ నేపథ్యంలో ఆయనకు చెందిన ఓ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. ప్రఖ్యాత ఫార్చ్యూన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తన కఠినమైన పని షెడ్యూల్ ను ఆయన ప్రస్తావించారు. ‘స్టార్ బక్స్ లో ఎవరైనా సాయంత్రం 6 తర్వాత నా సమయాన్ని ఒక్క నిమిషం తీసుకున్నా.. అది చాలా ముఖ్యమని వారు నిర్ధారించుకోవడం మంచిది’ అని అందులో పేర్కొన్నారు. అంటే.. ఎంత తీవ్ర పరిస్థితుల్లో ఉన్నామో పరోక్షంగా తెలిపారు. ఇది కాస్త వైరల్ గా మారింది. కాగా, 1967 మే 15న పుణేలో జన్మించిన లక్ష్మణ్ నరసింహన్ అక్కడి విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్, వార్టన్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చదివారు. మెకిన్సే లో 19 ఏళ్లు విధులు నిర్వర్తించారు. పెప్సికో, రెకిట్ లలోనూ కీలక పాత్రలు పోషించారు. 2022 అక్టోబరులో స్టార్‌బక్స్ లో చేరారు. అటు ఇటుగా ఏడాదిన్నరలోనే వైదొలగారు.