సుదీర్ఘ పని గంటలు.. సిం‘ఫుల్’గా తేల్చేసిన నారాయణమూర్తి
ఇలాంటి వేళ.. ఏ రచ్చకు కారణం అయ్యారో.. అదే రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేసే ప్రయత్నం చేశారు.
By: Tupaki Desk | 21 Jan 2025 4:00 AM GMTదేశం డెవలప్ మెంట్ లో దూసుకెళ్లాలంటే సుదీర్ఘ గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారానికి తెర తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఉద్యోగుల పని గంటలపై స్పందించటమే కాదు.. సుదీర్ఘ గంటలు పని చేయాలన్న అంశాన్ని విభేధించారు. దీనిపై మొదలైన లొల్లి నెలల తరబడి సాగుతున్నా.. దానికి ఫుల్ స్టాప్ పడటం లేదు.
ఇలాంటి వేళ.. ఏ రచ్చకు కారణం అయ్యారో.. అదే రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేసే ప్రయత్నం చేశారు. సుదీర్ఘ గంటలపై తాను చేసిన వ్యాఖ్యలపై నడుస్తున్న లొల్లిపై తనదైన శైలిలో సిం‘ఫుల్’ గా తేల్చేశారు. కిలాచంద్ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుపేద బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా కష్టపడి పని చేయాలా? వద్దా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకొని.. నిర్ణయం తీసుకోవాల్సిన విషయంగా పేర్కొన్నారు.
ఇంతకూ తాజా ప్రసంగంలో నారాయణమూర్తి సుదీర్ఘ పని గంటలపై ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘ఎవరూ ఎవరినీ గంటల తరబడి పని చేయాలని చెప్పరు. ఎవరికి వారే నిర్ణయించుకొని ఆలోచించుకొని తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నేను పొద్దున్నే ఆరున్నర గంటలకు ఆపీసుకు చేరుకునే వాడ్ని. రాత్రి ఎనిమిదిన్నరకు బయటకు వచ్చేవాడ్ని. ఇలా నేను దాదాపు నలభై ఏళ్లు పని చేశా. ఇది వాస్తవం. నేను స్వయంగా చేశాను. ఇది తప్పు.. నువ్వు ఇలా చేయాలి. ఇలా చేయకూడదు. అని ఎవరూ అనటానికి లేదు. ఇలాంటి వాటిపై చర్చలు.. వాదోపవాదాలు అనవసరం. మీకు మీరుగా ఆలోచించుకొని.. మీరు కోరుకున్నదే చేయటమే’ అంటూ తన వ్యాఖ్యలపై జరుగుతున్న లొల్లికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజా వ్యాఖ్యలపై ఎవరు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.