Begin typing your search above and press return to search.

మంత్రి నారాయణ Vs సజ్జల.. స్టోరీ ఇదే!

బ్యాక్ ఎండ్ లో ఆర్థిక వ్యవహారాల విషయంలో నారాయణ (నారాయణ సంస్థల అధినేత) సాయం చేసింది వాస్తవం.

By:  Tupaki Desk   |   19 Jun 2024 4:30 PM GMT
మంత్రి నారాయణ Vs సజ్జల.. స్టోరీ ఇదే!
X

అధికారం బెల్లం అయితే.. వాటి చుట్టూ మూగే ఈగల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ ఈగలన్ని ఒకేలా ఉండవు. కొన్ని సజ్జల రామక్రిష్ణారెడ్డి మాదిరి.. నారాయణ మాదిరి ఉంటాయన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అన్న విషయాన్ని అడిగే ముందు.. కాస్తంత ఓపిగ్గా పదేళ్ల వెనక్కి వెళితే విషయాలు మరింతగా అర్థమవుతాయి. 2004లో అధికారాన్ని చేజార్చుకున్న చంద్రబాబుకు తిరిగి అధికారంలోకి రావటానికి పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో పార్టీని ముందుకునడిపించింది చంద్రబాబే. బ్యాక్ ఎండ్ లో ఆర్థిక వ్యవహారాల విషయంలో నారాయణ (నారాయణ సంస్థల అధినేత) సాయం చేసింది వాస్తవం. అయితే.. ఇక్కడ మిస్ కాకూడని పాయింట్ ఏమంటే.. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న వేళలో నారాయణ బ్యాక్ ఎండ్ లో ఉండి.. పార్టీ నడవటానికి అవసరమైన ఇంధనాన్ని అందించారంతే.

దాన్ని అసరాగా చేసుకొని పోరాడిన చంద్రబాబు పోరాటం ఎట్టకేలకు వర్కువుట్ అయి.. 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చినంతనే అప్పటి చంద్రబాబు ముందు విభజన తర్వాత మిగిలిన ఏపీ.. రాజధాని లేకపోవటం.. ప్రత్యేక హోదా తప్పించి మరేదీ రాష్ట్రాన్ని మార్చే పరిస్థితి లేదన్న వాతావరణంతో పాటు.. ఎన్నో సమస్యలు. మరెన్నో సవాళ్లు. వీటి మధ్య తెర మీదకు వచ్చారు నారాయణ. ప్రజలకు ఇది సర్ ప్రైజ్ కావొచ్చు కానీ టీడీపీ వ్యవహారాల్ని చూసే వారికి.. రాజకీయ అవగాహన ఉన్న కొంతమందికి చంద్రబాబు సర్కారులో నారాయణ ఎలాంటి రోల్ ప్లే చేస్తారన్న దానిపై క్లారిటీ ఉంది.

కట్ చేస్తే.. అమరావతి ఎపిసోడ్ నుంచి కీలకమైన శాఖల్ని చేపట్టిన నారాయణ కారణంగా చంద్రబాబుకు.. ఆయన పార్టీకి జరిగిన డ్యామేజ్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వేళలో పార్టీకి అన్నీ తానైన చంద్రబాబు.. తిరిగి అధికారంలోకి తెచ్చిన సామర్థ్యం ఉన్నప్పుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపేందుకు నారాయణ లాంటి వారి అవసరం ఏమిటన్నది ప్రశ్న. అయితే.. కొన్నింటికి సమాధానాలు ఉండవు. నారాయణ సామర్థ్యం ప్రజలకు కానీ మిగిలిన వారికి కానీ కనిపించకపోవచ్చు. చంద్రబాబుకు బాగా కనిపించొచ్చు. నారాయణ కారణంగా లాభం జరిగిందా? నష్టం వాటిల్లిందా? అన్నది 2019లో జరిగిన ఎన్నికల్లో అర్థమైన పరిస్థితి.

కట్ చేస్తే.. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో కానీ ఇతర వేదికల మీద కానీ నారాయణ కనిపించిన సందర్భాల్లో వేళ్ల మీద లెక్కించొచ్చు. తాజా ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సాధించే వరకు బ్యాక్ ఎండ్ లో ఉన్న ఆయన.. తన పాత్రను నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారని చెప్పాలి. మళ్లీ.. పవర్ లోకి రాగానే తెర మీదకు వచ్చిన నారాయణ వల్ల ఏం జరగనుంది? అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే.. జగన్ విషయానికి వద్దాం. తన తండ్రి కం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా వైఎస్ దుర్మరణం పాలు కావటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న ఎన్నో నాటకీయ పరిస్థితులు.. సవాళ్లు.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి.. ఎట్టకేలకు 2019లో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్నారు.

రానున్న మరో రెండు.. మూడు దశాబ్దాల వరకు తన చేతిలోనే అధికారం ఉంటుందని.. శత్రువు సైతం తనను ప్రేమించేలా తన పాలన ఉంటుందని మొదటి మూడు రోజుల్లో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. అంతకు మించి కావాల్సిందేముందన్న భావన వ్యక్తమైంది. అప్పటివరకు ఎక్కడ ఉన్నాడో తెలీని సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా తెలుసు. ఆయన రోల్ ప్రభుత్వ సలహాదారు మాత్రమే. కానీ.. ఆయన ఏం చేశారు? ఎలా వ్యవహరించారన్నది ఏపీలోని వారికి మాత్రమే కాదు తెలుగు రాజకీయాల గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైన పరిస్థితి.

పవర్ చేతిలో లేనప్పుడు ఎక్కడ ఉన్నాడో ఈ సజ్జల. తన ఒంటి చేత్తో పార్టీని పవర్ లోకి తెచ్చిన జగన్ కు.. అధికారం చేతిలో ఉన్న వేళ సజ్జల మీద అంతలా ఆధారపడాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. చూస్తుండగానే సీఎంవోకు మాత్రమే కాదు.. జగన్ కు సైతం కళ్లు.. చెవులుగా ఆయన మారారు. ఐదేళ్ల ఆయనదే ఏకఛత్రాధిపత్యం. కట్ చేస్తే.. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయన్నది తెలిసిందే.

ఓట్ల లెక్కింపునకు రోజు ముందు మీడియా ముందుకు వచ్చిన పెద్దమనిషి.. రేపు ఉదయం 11 గంటల నుంచి సంబరాలు మొదలెట్టేద్దామంటూ చివరి నిమిషంలోనూ అంతుచిక్కని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఆయన మాటల్ని నమ్మి.. బెట్టింగు రాజాలు చెలరేగిపోవటం.. ఫలితం వెల్లడైన తర్వాత అడ్డంగా బుక్ అయ్యామన్న విషయం అర్థమై లబోదిబోమన్న పరిస్థితి. కట్ చేస్తే.. అప్పటి నుంచి మళ్లీ కనిపించని సజ్జల ఇప్పుడెక్కడ? అన్న ఆరా వినిపిస్తోంది. మొత్తంగా చెప్పేదేమంటే.. అధికారం లేనప్పుడు తమను తాము మేనేజ్ చేసుకుంటూ.. పార్టీని మేనేజ్ చేసే జగన్ కానీ చంద్రబాబు కానీ.. పవర్ లోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరిద్దరి మీద ఎందుకు ఆధారపడాలి? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఎప్పటికి దొరుకుతుందంటారు?