అమారావతి నిర్మాణంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణంపైనే ముందుగా దృష్టి సారిస్తారనే మాటలు వినిపించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Jun 2024 4:13 AM GMTఏపీలో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణంపైనే ముందుగా దృష్టి సారిస్తారనే మాటలు వినిపించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి రావడం.. ప్రభుత్వం కొలువుదీరడంతో అమరావతి నిర్మాణ పనులు భారీ వేగంతో ముందుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
అవును... 2014-19 మధ్య పురపాలక శాఖ మంత్రిగ ఉంటూ రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన నారాయణకు ఊహించినట్లుగానే తిరిగి అదేశాఖను కేటాయించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో తాజాగా అమరావతి నిర్మాణం, పెట్టుకున్న డెడ్ లైన్, ఇప్పటివరకూ చేసిన పనులపై నారాయణ స్పందించారు.
ఇందులో భాగంగా... మరో రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాల్ని కేవలం 58 రోజుల్లో ఇచ్చారని.. ఈ క్రమంలో రాజధాని పరిధిలోని ప్రతీ గ్రామంతోనూ తనకు అనుబంధం ఉందని తెలిపారు.
ఇక రాజధానిలో ఇప్పటికే సుమారు రూ.9 వేల కోట్లు ఖర్చుపెట్టి రహదారుల నిర్మాణం, తదితర మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పిన నారాయణ... ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రూప్ 4 ఉద్యోగుల వసతి భవనాల నిర్మాణం గత టీడీపీ హయాంలోనే సుమారు 70 - 90% పూర్తయ్యాయని తెలిపారు.
ఈ క్రమంలోనే ఈ వసతి గృహాలకు సంబంధించిన పెండింగ్ పనులను మరో ఆరునెలల్లో పూర్తిచేసేస్తామని అన్నారు. ఇదే సమయంలో అమరావతి పనుల ప్రారంభంపై మరో పదిరోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. అదేవిధంగా... ప్రస్తుతం అమరావతి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేస్తామని.. ఆ నివేదిక రావడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతుందని తెలిపారు.