కేసీఆర్‌కు పట్టిన గతే: జగన్‌కు కామ్రెడ్ శాపాలు
ఏపీ సీఎం జగన్‌కు కామ్రెడ్.. నారాయణ శాపాలు పెట్టారు. కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని అన్నారు
By: Tupaki Desk | 5 May 2024 11:30 PM GMTఏపీ సీఎం జగన్‌కు కామ్రెడ్.. నారాయణ శాపాలు పెట్టారు. కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను చెండుకు తింటున్నాడని.. ప్రజలకు నిరంకుశత్వం అంటే ఏమిటో చూపిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దోచుకున్నది చాలక ఇప్పుడు.. భూములు, ఆస్తులు కూడా దోచుకునేందుకు వస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా `జగనన్న భూరక్ష` పధకాన్ని నారాయణ తప్పుబట్టారు.
జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం కింద చేస్తున్న సర్వేల్లో తప్పులు వస్తున్నాయని కామ్రెడ్ నారాయణ అన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకపోగా ఈ పథకం కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంద ని నారాయణ వ్యాఖ్యానించారు. ``జగనన్న భూరక్ష పథకం కాస్తా భూ భక్ష పథకం``గా మారిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ ధరణి పథకం కారణంగా ఓడిపోయాడని.. ఇక్కడ ఏపీలో సీఎం జగన్ కూడా.. శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంతోనే భూస్థాపితం అవుతారని కామ్రెడ్ నారాయణ శాపం పెట్టారు.
చిత్తూరు జిల్లా నగరి మండలంలోని నారాయణ స్వగ్రామం ఆయనం బాకంలో పొలాలను నారాయణ పరి శీలించారు. అక్కడికే మీడియా ను పిలిపించుకుని ఆయన జగనన్న భూ రక్ష పథకంపై వివరణ ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నారని, ఈ పుస్తకంలో డొల్ల తనమే తప్ప, కనీసం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవడానికి కూడా ఇది పనికి రాదన్నారు. జగన్ తన బొమ్మను అచ్చు వేసి కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శలు చేశారు.
జగన్ ప్రభుత్వం చేసిన సర్వేతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారాయణ విమర్శలు చేశారు. వేల కోట్లు ఖర్చు పెట్టి బండలు వేశారని, చివరకు ఈ పుస్తకాలు తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ను ధరణి పథకమే దెబ్బ తీసిందని, ఇప్పుడు జగన్ కూడా భూరక్షతో ఓడిపోనున్నారని నారాయణ జోస్యం చెప్పారు.