Begin typing your search above and press return to search.

ఎక్కువ గంటలు పని చేస్తే ఏమవుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయి?

వారానికి 70 గంటలు పని చేయాలంటూ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 5:01 AM GMT
ఎక్కువ గంటలు పని చేస్తే ఏమవుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయి?
X

వారానికి 70 గంటలు పని చేయాలంటూ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగులు వారానికి 70 గంటలు అంటే.. ఇంచుమించు రోజుకు 13-14 గంటలు పని చేయాలన్న మాటపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వారానికి 70 గంటలు అంటే.. వారంలో రెండు వీక్ ఆఫ్ లను పరిగణలోకి తీసుకుంటే.. మిగిలేది 5 రోజులు. అంటే.. రోజుకు 14 గంటలు. మధ్యలో భోజన విరామం.. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి వెళ్లటాన్ని లెక్కలోకి తీసుకుంటే.. దీనికి కనిష్ఠంగా 2.30 గంటలు గరిష్ఠంగా నాలుగు గంటలు. సరాసరిన మూడు గంటలు వేసుకుంటే.. రోజులోని 24 గంటల్లో ఆఫీసులో పని.. దాని చుట్టూనే 18-19 గంటలు పని చేయాల్సి ఉంటుంది. మరి.. అప్పుడు వ్యక్తిగత జీవితం మాటేమిటి? అన్నది అసలు ప్రశ్న.

ఇన్ఫోసిస్ పెద్దాయన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని గంటల చొప్పున పని చేస్తున్నారు? వారానికి 70గంటలు పని చేస్తే ఏమవుతుంది? లాంటి విషయాల్లోకి వెళితే.. దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎక్కువ పని గంటలతో ఎక్కువ ప్రొడక్షన్ అన్నది కాలం చెల్లిన మాటగా చెప్పాలి. ఇలాంటి సమయంలో పని చేస్తున్నట్లు కనిపించినా.. ఉత్పాదకత మీద ప్రభావాన్ని చూపుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల చేత పని చేయించే విధానం చూస్తే.. సరాసరిన వారానికి 49 గంటలు మాత్రమే పని చేయిస్తున్నాయి. భారతదేశం విషయానికి వస్తే.. రోజువారీ విశ్రాంతి సమయం.. వార్షిక సెలవులు కలిపితే వారానికి 48 గంటలకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. సరాసరిన 40-44 గంటల మధ్యనే ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ పనిగంటలు ఉన్న దేశం జర్మనీ.

ఈ దేశంలో ఏడాదిలో 1340 గంటలు పని గంటలుగా ఫిక్సు చేస్తారు. అదే సమయంలో ఎక్కువ పని గంటలు అమలుచేసే దేశాల్లో మెక్సికో.. కొలంబియా.. కోస్టారికాలో ఏడాదికి 1886 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. 2016 ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అంతర్జాతీయ కార్మిక సంస్థల అధ్యయనం ప్రకారం.. ఎవరైతే వారానికి 55 గంటలు దాటి పని చేస్తారో.. వారిలో ప్రతి పది మందిలో ఒకరు గుండెపోటుతో మరణిస్తారని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు గుండెపోటుతో మరణించారంటే.. అత్యధిక భాగం ఎక్కువ గంటలు పని చేయటం కూడా కారణంగా చెబుతారు. భారత కార్మిక మంత్రిత్వ శాఖ రోజుకు 12 గంటల పని ఉండాలని పార్లమెంటులో చట్టం చేసినా..ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం ఓవర్ టైంతో కలిపి 50-60 గంటల పని గంటలు దాటకూడదన్న నిబంధనల్ని పాటిస్తున్నారు. ఎక్కువగా పని చేయటం.. మరింత ఎక్కువగా ఒత్తిడిని పెంచటమేనన్న మాట వినిపస్తోంది. ఇన్ఫోసిస్ పెద్దాయన ఇవేమీ తెలీకుండానే మాట్లాడారా? అన్నదిప్పుడు ప్రశ్న.