అన్నా ఏం చేద్దామో చెప్పు: మంత్రి నారాయణ స్వామికి షాక్!
ఈ సందర్భంగా ఏం జరిగిందనే విషయం అధికారికంగా తెలియకపోయినా.. సీఎం జగన్ ఆయనకు టికెట్ లేదని చెప్పేసినట్టు తాడేపల్లి వర్గాలు అంటున్నారు.
By: Tupaki Desk | 1 Aug 2023 3:45 AM GMTఏపీలో అనుకున్నట్టే రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కొన్నాళ్ల కిందట నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. వచ్చిన ఎస్సీ సామాజిక వర్గానికిచెందిన నాయకుడు, మంత్రి కిళత్తూరు నారాయణ స్వామికి పార్టీ అధిష్టానం గట్టి షాకే ఇచ్చినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న నారాయణ స్వామికి.. సీఎం జగన్ వరుసగా రెండు సార్లు తన కేబినెట్‌లో మంత్రి పదవిని ఇచ్చారు. ఈయన కూడా సీఎం జగన్‌కు అత్యంత అభిమానిగా మారిపోయారు.
సీఎం జగన్‌ను దేవుడితో పోల్చారు. అంతేకాదు.. సీఎం జగన్ ఒకవైపు.. ఆయన సతీమణి భారతి మరోవైపు ఉన్న ఫొటోలతో కూడిన ఉంగరాన్ని చేయించుకుని మరీ ధరించారు. అయితే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో రెడ్డి సామాజికవర్గం.. దూకుడు ముందు ఆయన నిలవలేక పోయారని కొన్నాళ్లుగా వైసీపీలోనే చర్చ సాగుతోంది.
ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మె ల్యేలు డమ్మీలుగా మారిపోయారని.. వారికి ఎలాంటి హక్కులు, అధికారాలు కూడా లేకుండా పోయాయని.. కొన్నాళ్ల కిందట ఉమ్మడి పశ్చిమకు చెందిన ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
అచ్చం ఇలాంటి పరిస్థితే.. మంత్రి నారాయణ స్వామికి కూడా ఎదురైందనేని గంగాధర నెల్లూరు టాక్. కొన్నాళ్లు భరించినా.. తర్వాత తర్వాత.. ఆయన సహనం కోల్పోయారు. నేరుగా తన అసహనాన్ని బయటకు ప్రదర్శించారు. రెడ్లు తనను తొక్కేస్తు న్నారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఒకసందర్భంలో అయితే.. నేరుగా కొందరి పేర్లు కూడా చెప్పారు. మొత్తంగా చూస్తే.. మంత్రి నారాయణ స్వామి వ్యవహారం కొన్నాళ్లుగా ముదురుతూనే ఉంది. ఇక, ఆయనకు టికెట్ కష్టమేనని.. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్‌గా చేసిన కుతూహలమ్మ(మరణించారు) కుమారుడికి ఇక్కడ ఒక రెడ్డిమంత్రి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని చర్చసాగింది.
కట్ చేస్తే.. తాజాగా మంత్రి నారాయణ స్వామికి సీఎంవో నుంచి పిలుపు అందడం.. ఆయన ఆదరాబాదరాగా తాడేపల్లికి రావడం జరిగిపోయాయి. ఈ సందర్భంగా ఏం జరిగిందనే విషయం అధికారికంగా తెలియకపోయినా.. సీఎం జగన్ ఆయనకు టికెట్ లేదని చెప్పేసినట్టు తాడేపల్లి వర్గాలు అంటున్నారు. 'అన్నా ఏం చేద్దాం' అని సీఎం జగన్ స్వయంగా ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం.
వచ్చే ఎన్నికలు చాలా కీలకమని.. కానీ.. గ్రాఫ్ లేకుండా పోయిందని.. నువ్వు బాగానే ప్రజల్లో ఉంటున్నావని.. అయితే.. ప్రత్యర్థి పక్షం బలంగా ఉందని.. కాబట్టి నిన్ను ఎమ్మెల్సీగా పంపించాలని అనుకుంటున్నామని.. సీఎం జగన్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయితే.. ఎన్నికల్లో మాత్రం ఈ నియోజకవర్గంలో గెలిపించాలనే షరతు పెట్టారని అంటున్నారు. మొత్తానికి నారాయణస్వామి ఊహించింది.. విశ్లేషకులు భావించిందే జరగడం గమనార్హం.