వైఎస్సార్ మరణంపై డిప్యూటీ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు!
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jan 2024 11:27 AM GMTఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం విషయంలో సోనియాగాంధీ పాత్రపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోమారు మరింత సంచలనంగా స్పందించారు నారాయణ స్వామి.
అవును... వైఎస్సార్ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో ఆయన మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ హస్తం ఉందంటూ నారాయణ స్వామి వ్యాఖ్యానించారని మల్లు రవి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆయన... ఆ అనుమానం ప్రజలందరికీ ఉందని, ప్రజలందరిపైనా కేసులు పెడతారా అని ప్రశ్నించారు.
ఇందులో భాగంగా... సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హెలికాఫ్టర్ ప్రమాదంలో చంపారని ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో ప్రతీ ఒక్కరిలో సందేహం ఉందని అన్నారు నారాయణ స్వామి. ఈ సందర్భంగా మల్లురవిని ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రజలలో ఉన్న ఆ సందేహాన్ని తీర్చే శక్తి మీకు కానీ, సోనియా గాంధీకి, చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్ మరణం అనంతరం ఆయనపై కేసు పెట్టారని తెలిపారు!
ఇదే సమయంలో... సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా హింసించి పొట్టనపెట్టుకున్నారో మీకు తెలియదా అని రవిని ప్రశ్నించిన నారాయణ స్వామి... సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి ఏమీ తప్పుచేయనటువంటి వ్యక్తి, ఎవరికీ భయపడనటువంటి వ్యక్తి అయిన వైఎస్ జగన్ పైన అన్యాయమైన కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టింది మీకు తెలియదా అని ప్రశ్నించారు. అప్పుడు మీ నోరు ఎక్కడికి పోయిందంటూ మల్లు రవిని నిలదీశారు.
దీంతో ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. వైఎస్సార్ మరణంపై ప్రజలందరికీ సందేహాలు ఉన్నాయని... వాటిని సోనియా గాంధీ, చంద్రబాబుకు తీర్చే శక్తి లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రల్లో మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి!