Begin typing your search above and press return to search.

భువనేశ్వరిపై నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు!

మరోవైపు ఈ వ్యవహారంలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:24 PM GMT
భువనేశ్వరిపై నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు!
X

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం బాగోలేదని.. జైలులో దోమలు ఉన్నాయని.. కావాలనే చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన సతీమణి భువనేశ్వరి ఇప్పటికే ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని వైద్యాధికారులు నివేదిక ఇచ్చినా జైలు అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. జైలులో చంద్రబాబు ప్రాణాలకే ముప్పు ఉందని ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాట్‌ కామెంట్స్‌ చేశారు. సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుకు ప్రాణహాని ఉందని భువనేశ్వరి వ్యాఖ్యలు చేస్తున్నారని, కానీ భువనేశ్వరి వల్లే చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై భువనేశ్వరితోపాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చంపితే భువనేశ్వరే చంపాలి అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరికి..కుమారుడు లోకేశ్‌ కు పదవీ కాంక్ష వచ్చేసిందని.. ఈ నేపథ్యంలో చంద్రబాబును చంపితే ఆమే చంపాలన్నారు. అన్నంలో ఏదన్నా పెట్టి చంపినా చంపొచ్చేమో తనకు తెలియదన్నారు.

గతంలో తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్‌ ను మోసం చేసిన పురంధేశ్వరి ఇప్పుడు సోదరి భర్త చంద్రబాబును కాపాడేందుకు తపనపడిపోతున్నారని మండిపడ్డారు.

పురందేశ్వరి తన మరిది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ ను కాపాడేందుకే మద్యం పాట పాడుతున్నారని మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. పురందేశ్వరి బీజీపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి, ఆమె భర్త సైతం ఎన్టీఆర్‌ మృతికి కారకులయ్యారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ కూతురుగా చెప్పుకోవడానికి ఆమెకు అర్హత లేదన్నారు.

చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్‌ కళ్యాణ్‌ అని నారాయణ స్వామి గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ న్యాయపరంగానే జరిగిందని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందన రాలేదన్నారు.

నారాయణస్వామి వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారాయి.

ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. భువనేశ్వరిపై నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌ లో చంద్రబాబు ఆరోగ్యంపై కుట్ర జరుగుతోందన్నారు.