Begin typing your search above and press return to search.

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పూర్తిగా పరితపిస్తోంది

By:  Tupaki Desk   |   17 May 2024 12:58 PM GMT
మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !
X

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పూర్తిగా పరితపిస్తోంది. దాని కోసం పట్టుదలగా పనిచేస్తోంది. ఏకంగా 370 సీట్లు సొంతంగానే గెలుచుకోవాలని టార్గెట్ కూడా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఏ రాజకీయ పార్టీకి అయిన బలమైన నినాదం ఎన్నికల్లో ఉండాలి. అది జనాలకు పూర్తిగా కనెక్ట్ అయి ఉండాలి.

అపుడే ఆశించిన స్పందన కనిపిస్తోంది. ఇక ఎన్నికల షెడ్యూల్ రాక ముందు వరకూ చూస్తే బీజేపీ చేతిలో ఒక బలమైన అస్త్రం ఉంది. అదే అయోధ్యలో రామమందిరం నిర్మాణం. ఇది తమకు ఈసారి ఒడ్డెక్కిస్తుందని బీజేపీ చాలా నమ్మకంగా భావించింది. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కార్యక్రమాన్ని పూర్తిగా పార్టీ వేడుకగా మార్చేసారు అన్న విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బీజేపీ తన అజెండా ఏమిటో చెప్పక చెప్పేసింది అని అన్నారు.

ఒక దశలో అయితే దేశంలో సగం ఎలక్షన్ ని రామమందిరం ప్రారంభోత్సవం పూర్తి చేసింది అని కూడా విశ్లేషించారు. బీజేపీకి సగం పని పూర్తి అయింది ఇక విజయానికి సగం దూరంలోనే ఉంది అని అన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే బీజేపీ ఎన్నికల నినాదంగా సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే కూటమితో కలిపి నాలుగు వందల సీట్లు అని ప్రకటించారు.

ఇదంతా ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందు సంగతి. తీరా ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక మాత్రం ఒక్కసారిగా దేశంలో పొలిటికల్ సినారియో మారిపోయింది. అయోధ్యలో రామమందిరం అన్నది అసలు ఇష్యూనే కాకుండా పోయిన నేపధ్యం ఏర్పడింది. దాంతో బీజేపీ రకరకాలైన అంశాలను తెర మీదకు తీసుకుని రావాల్సి వచ్చింది.

అందులో ప్రముఖంగా ఉన్నది ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు అన్నది. నిజానికి ఇది ఎమోషన్ పండించే ఇష్యూనే. కానీ బీజేపీ గత పదేళ్లుగా చేసిన పాలన దాని మూలాన వచ్చిన యాంటీ ఇంకెంబెన్సీతో ఈ ఎమోషన్ సైడ్ కి పోయింది. పైగా ప్రతీ సారీ ఎన్నికలకు ముందు ఇలాంటి అంశాలను బీజేపీ కోరి తెర ముందుకు తెస్తుంది అని విమర్శలు విపక్షాల నుంచి రావడంతో పాటు జనంలోనూ అదే రకమైన భావన ఉండడంతో ఈ అంశం పెద్దగా పని చేయకుండా పోయింది.

మరో వైపు చూస్తే కనుక బీజేపీ పీవోకే ని స్వాధీనం చేసుకుంటామని బలమైన నినాదాన్ని ఇచ్చింది. అయితే అది కూడా జనంలోకి పెద్దగా వెళ్ళినట్లుగా కనిపించలేదు. ఇక దేశంలో ఆస్తులను ఒక వర్గానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కట్టబెడుతుందని బీజేపీ చేసిన కామెంట్స్ బూమరాంగ్ అయ్యాయి. అలాగే ఎక్కువ మంది పిల్లలను కంటారు అంటూ చేసిన మరో కామెంట్ కూడా జనాలను ఆకట్టుకోలేదు. అయితే వాటికి ఆ తరువాత సవరణలు ఇస్తూ బీజేపీ పెద్దలు ఇచ్చిన వివరణలు కూడా జనాలకు ఎక్కలేదు.

దీంతో చూస్తూండగానే నాలుగు విడతల ఎన్నికలు దేశంలో జరిగిపోయాయి. దాంతో పాటు పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టడం ముగిసిన పోలింగులో ఓటర్ల సరళి వంటివి బేరీజు వేసుకున్న బీజేపీ ఇపుడు అసలు వాస్తవాలతో జనాలకు చేరువ కావాలని చూస్తోంది. ఈ లోగా మెజారిటీ పోలింగ్ ముగిసిపోయింది. ఇక మిగిలిన ఆ చివరి మూడు విడతల పోలింగ్ లో బీజేపీ గతిని గమ్యాన్ని మార్చాలని ఆలోచిస్తున్నారు.

అందుకే మెల్లగా రాముడు నుంచి పక్కకు జరిగి పేదల పక్షం వహించే విధంగా బీజేపీ మరో నినాదాన్ని అందుకుంది. అదే పేదలకు రేషన్ బియ్యం. ఈ దేశంలో నూటికి ఎనభై కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ తాజాగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ఇపుడు ఇది నిజంగా ఎన్నికల అంశమే అవుతుంది. ఎందుకంటే ఆకలిని తీర్చేందుకు ఏమి చేశారు అన్నదే ఏ ప్రభుత్వానికి అయినా ఎదురయ్యే ప్రశ్న. మిగిలిన అంశాలు ఏవీ ఎమోషనల్ గా ఉంటాయేమో కానీ కూడూ గూడూ పెట్టవు. అయితే బీజేపీ ఆఖరి దశలో ఇస్తున్న నినాదం ఏమేరకు పనిచేస్తుంది అన్నది చర్చగా ఉంది.

అంతే కాదు మోడీ పలు ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వం మరోసారి వస్తే యువత సమస్యలను అడ్రస్ చేస్తామని చెప్పారు. ఇది కూడా బీజేపీలో వస్తున్న మౌలికమైన మార్పుగా చూడాలి. అయితే ఎన్నికలకు ముందు గడచిన పదేళ్ల పాలనలో యువత సమస్యలను పూర్తి స్థాయిలో అడ్రస్ చేసి ఉంటే ఇపుడు అవే బీజేపీ విజయానిని నిచ్చెన మెట్లుగా ఉండేవి కదా అన్న మాట వినిపిస్తోంది. అంతే కాదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. వాటిలో కనీసం ఎంతో కొంత శాతం భర్తీ చేసి ఉంటే కనుక అది బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారి యువతను దగ్గర చేసేది కదా అన్న మాటా ఉంది ఏది ఏమైనా రాజకీయ పార్టీలు వాస్తవ దృక్పధంతో ఉండాలి.

తాము చెప్పిందే జనాలు వింటారని, తామే వారిని డ్రైవ్ చేస్తున్నామని అనుకుంటే ఒక్కోసారి ఫలితాలు తేడా కొడతాయి. ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికలు బీజేపీ పదేళ్ళ పాలన మీద జనాభిప్రాయమే అని ప్రతిపక్షాలు మేధావులూ అంటున్నారు. దాంతో బీజేపీ తన విజయాలను చెప్పుకోవడం ద్వారానే ఎన్నికల్లో జనాలకు చేరువ కాగలదు అని అంటున్నారు. అలా పదేళ్ల పాలనలో చేసిన మేలు గురించి చర్చకు పెట్టాల్సిన అవసరం అయితే బీజేపీకి ఇపుడు వచ్చింది.