Begin typing your search above and press return to search.

మోడీకి బాబు థాంక్స్...నితీష్ డబుల్ థాంక్స్

దాంతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలలో ఇది చర్చగా ముందుకు వస్తోంది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:03 AM GMT
మోడీకి బాబు థాంక్స్...నితీష్ డబుల్ థాంక్స్
X

అవును కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉండగా ఎవరికీ చేయని అతి పెద్ద సాయాన్ని ఎన్డీయే మిత్రులుగా తమ ప్రభుత్వానికి ఊతకర్రగా ఉన్న ఏపీ బీహార్ రాష్ట్రాలకు చేసింది.

దాంతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలలో ఇది చర్చగా ముందుకు వస్తోంది. ఏకంగా ఆరేడు వేల కోట్ల రూపాయలను ఈ రెండు రాష్ట్రాలకే మోడీ ప్రభుత్వం కేటాయింపులు చేయడం అంటే సింహ భాగం తెచ్చి పెట్టేయడమే అని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా రాజకీయం కోసమే అని అంటున్నాయి.

తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే మిత్రులకు ఇలా భారీగా నిధులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధానికి 57 కిలోమీటర్లతో కొత్త రైల్వే లైన్ ని వేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ రాజధానికి రైల్వే కనెక్టివిటీ వల్ల దేశంలోని అన్ని రాజధానులను అనుసంధానం చేసేందుకు వీలుగా కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి రైల్వే లైన్ కు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిమండలికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ఇక ఈ కొత్త రైల్వే లైన్ చూస్తే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా నగరాలను కలుపుతుంది. దీని కోసం ఏకంగా 2,245 కోట్ల రూపాయలను వెచ్చిస్తారు. సో ఆ విధంగా చూస్తే కేంద్రం ఏపీకి మంచి మేలు చేసినట్లే అని భావించాలి. అయితే బీహార్ తో పోల్చినపుడు ఏపీకి ఒక వంతు సాయమే దక్కిందని అనుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే బీహార్ కి ఏకంగా 4,553 కోట్ల రూపాయల విలువ చేసే రెండు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. అంటే ఏపీకి 2,245 కోట్లతో ఒక ప్రాజెక్ట్ కే ఇస్తే బీహార్ కి అంతకు రెట్టింపు నిధులతో రెండు ప్రాజెక్టులను ఇచ్చింది.

మరి ఒక ప్రాజెక్ట్ నే ఇచ్చిన మోడీకి చంద్రబాబు ఎంతో భావోద్వేగంతో థాంక్స్ అని పదే పదే చెప్పుకొచ్చారు. ఇంతకు మించి రెట్టింపు నిధులతో రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను ఇస్తే బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ డబుల్ థాంక్స్ చెప్పాల్సి ఉందని అంటున్నారు. మరి ఆయన చెప్పారో లేదో తెలియదు అని అంటున్నారు

ఇవన్నీ పక్కన పెడితే ఎన్డీయేలో కీలక రాష్ట్రాలకే కేంద్రం రైల్వే కానుకలు ఇచ్చిందని విపక్షాలు అంటున్నారు. అయితే అందులోనూ ఏపీకి తక్కువ బీహార్ కి ఎక్కువ ఇచ్చి వివక్షను పాటించిందని మరో వైపు చర్చ సాగుతోంది.

నిజానికి చూస్తే ఏపీ నుంచి 18 మంది ఎంపీలు కేంద్రంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నారు. బీహార్ లో చూస్తే పదహారు మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. పైగా జేడీయూకి 12 మంది ఎంపీలు ఉంటే టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఏపీయే ఏ విధంగా చూసినా కేంద్రానికి కీలక మద్దతుదారు.

పైగా ఏపీ విభజన కష్టాలు పడుతోంది. పదేళ్ళుగా ఏపీకి కేంద్రం పెద్దగా ఇచ్చినది తక్కువే అని కూడా విమర్శలు ఉన్నాయి. ఇపుడు ఇంతటి కీలక మద్దతుని అందుకుంటూ కూడా బీహార్ కంటే తక్కువ నిధులు ఏపీకి ఇవ్వడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఏపీలోని అమరావతితో పాటు మరిన్ని రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపితే బాగుంటుందని అంటున్న వారూ ఉన్నారు.

ఏది ఏమైనా కేంద్రం ఎంత ఇచ్చినా ఏపీకి ఎక్కువ అన్నట్లుగా అల్ప సంతోషం చంద్రబాబుది. ఎంత ఎక్కువ ఇచ్చినా ఏమీ అనని మౌన హృదయం నితీష్ బాబుది. మరి మిగిలిన రాష్ట్రాలు అయితే ఈ రెండింటికే నిధులు అంటూ ఆవేదన చెందే పరిస్థితి ఉంది. నిజంగా ఏపీని చూసి ఈర్ష్య పడే సీన్ ఉందా. ఏపీకి నిజంగా కేంద్రం అంత పెద్ద ఎత్తున సాయం కురిపించేస్తోందా. ఆలోచించండి ప్లీజ్.