Begin typing your search above and press return to search.

వన్ నేషన్.. వన్ ఎలక్షన్స్‌పై ప్రధాని మరోసారి సంచలన వ్యాఖ్యలు

దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు 'ఒక దేశం-ఒకే ఎన్నికలు', 'ఒకే దేశం-ఒకే సివిల్ కోడ్' అమలుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

By:  Tupaki Desk   |   31 Oct 2024 9:13 AM GMT
వన్ నేషన్.. వన్ ఎలక్షన్స్‌పై ప్రధాని మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. గత ఎన్నికల సందర్భంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నమూ చేసింది. కానీ.. ప్రతిపక్షాల నుంచి పెద్దగా సపోర్టు లభించలేదు. తీవ్రంగా వ్యతిరేకించడంతో ఎప్పటి పద్ధతిలోనే గత ఎన్నికలు కూడా ముగిశాయి. అయితే.. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికలను మాత్రం తప్పనిసరిగా జమిలీ పద్ధతిలోనే నిర్వహిస్తామని బీజేపీ ఖరాఖండిగా చెప్పింది. అదే అంశాన్ని తన మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. తాజాగా.. జమిలీ ఎన్నికలకు ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకే జమిలీ ఎన్నికలు. దీనినే వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం లోక్‌సభతోపాటు ఏపీ, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగితా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అక్కడి పదవీ కాలం గడువు ముగిసిన తరువాత నిర్వహిస్తున్నారు. అయితే.. దీంతో ఖర్చు తడిసిమోపెడు అవుతుండడం.. సమయం కూడా వృథా అవుతుండడంతో కేంద్రం జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేసింది. అంతేకాకుండా.. అధికార యంత్రాంగానికి కూడా ఎన్నికల విధులు నిర్వహించే సమయం తగ్గుతుంది. దీనివల్ల పరిపాలనపై దృష్టి సారించవచ్చని కేంద్రం భావించింది.

ఒకే దేశం.. ఒకే ఎన్నికపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి 2023 సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. 191 రోజులపాటు ఈ కమిటీ విస్తృతంగా పర్యటించింది. రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరిపింది. 18వేలకు పైగా పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతికి అందించారు. జమిలీ ఎన్నికల్లో భాగంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది. ఆ తరువాత వంద రోజుల్లోపు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ/మున్సిపల్ ఎన్నికల కోసం ఒకే ఎన్నికల జాబితా, ఒకే ఓటరు గుర్తింపు వినియోగించాలని కూడా సిఫారసు చేసింది.

ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికలపై నేడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు 'ఒక దేశం-ఒకే ఎన్నికలు', 'ఒకే దేశం-ఒకే సివిల్ కోడ్' అమలుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొన్న మోడీ.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒకే దేశం-ఒకే గుర్తింపు కార్డు', 'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు', 'ఒకే దేశం-ఒకే ఆరోగ్య బీమా'లో విజయవంతం అయ్యామని, ఇప్పుడు 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు', ఒకే దేశం-ఒక సెక్యులర్ సివిల్ కోడ్' ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వన్ నేషన్, వన్ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఆయుష్మాన్ భారత్ రూపంలో అందించామన్నారు. మోడీ వ్యాఖ్యలతో జమిలీ ఎన్నికలపై మరోసారి క్లారిటీ వచ్చేసింది. వచ్చే సీజన్ ఎన్నికలు తప్పనిసరిగా జమిలీ పద్ధతిలోనే జరగబోతున్నాయనేది అర్థం చేసుకోవాల్సిందే.