మోడీకి విదేశీ సంకటం.. ఒకేసారి రెండు సమస్యలు!
ఆది నుంచి బంగ్లాదేశ్‌తోపాటు.. హసీనా కుటుంబంతోనూ భారత్‌కు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ తీసుకునే నిర్ణయం సర్వత్రా ఆసక్తిగా మారింది.
By: Tupaki Desk | 17 Oct 2024 4:11 PM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒకేసారి రెండు సమస్యలు వచ్చాయి. అది కూడా.. కీలకమైన ఎన్నికల సమయంలో కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 1) కెనడా దూకుడు. 2) పొరుగున ఉన్న మిత్ర దేశం బంగ్లాదేశ్ ఆదేశాలు. ఈ రెండు విషయాలు కూడా ఇప్పుడే తెరమీదికి వచ్చాయి. పైగా.. ఈ రెండు అంశాలకు కూడా భారత మిత్ర దేశాలుగా ఉన్న అమెరికా, మెక్సికో సహా మరికొన్ని దేశాలు మద్దతిస్తున్నాయి.
1) కెనడా దూకుడు: కెనడాలో జరిగిన ఖలిస్థానీ తీవ్రవాది(భారత్ చెబుతున్నట్టు) హర్దీప్ సింగ్ నిజ్జర్ దారుణ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని.. ముఖ్యంగా ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనేఆయనను కెనడాలోనే హత్య చేశారని.. దీనిని కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ రాయ్ పర్యవేక్షించారని కెనడా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. అయితే.. దీనిని భారత్ ఖండిస్తోంది.
కెనడా ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకమేనని.. శత్రువులతో చేతులు కలిపి ఇప్పుడు భారత్‌ను ఏదో చేయాలని చూస్తోందని విదేశాంగ శాఖ చెబుతుండడం గమనార్హం. అయితే.. అమెరికా, స్విట్జర్లాండ్, మెక్సికో, బ్రిటన్ సహా అనేక దేశాలు.. ఇప్పుడు కెనడాకు మద్దతుగా నిలిచాయి. ``భారత్ పెద్ద దేశం. పెద్దన్నగా సహకరిస్తే.. పోయేదేమీ లేదు`` అని సూత్రీకరిస్తున్నాయి. ఇది .. మోడీ సర్కారుకు ఇబ్బందిగా మారింది. కీలక సమయంలో ఇలా ఆయా దేశాలు భారత్కు వ్యతిరేకంగా స్వరంగా వినిపించడాన్ని సహించలేక పోతున్నారు. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
2) ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న రిజర్వేషన్ అల్లర్ల కారణంగా ఆదేశ అప్పటి ప్రధాని షేక్ హసీనా.. పారిపోయి వచ్చి.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆమెను విచారించాల్సి ఉందని.. ఆమెకు తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అప్పటి నుంచి భారత్ను కోరుతోంది. కానీ, భారత్ స్పందించడం లేదు. ఇప్పుడు తాజాగా ఈ నెల 18లోగా(శుక్రవారం) ఆమెను అరెస్టు చేయాలని.. అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. దీనిని బంగ్లా ప్రభుత్వం భారత్‌కు పంపించింది. తమకు తక్షణం హసీనాను అప్పగించాలని షరతు విధించింది. ఇది కూడా మోడీకి సెగ పెడుతోంది. ఆది నుంచి బంగ్లాదేశ్‌తోపాటు.. హసీనా కుటుంబంతోనూ భారత్‌కు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ తీసుకునే నిర్ణయం సర్వత్రా ఆసక్తిగా మారింది.