Begin typing your search above and press return to search.

'నీ మీద ఒక ఫిర్యాదు ఉంది'... లోకేష్ పై మోడీ చమత్కారం అలా ఉంది!

విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన సభాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు నారా లోకేష్ పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 5:44 AM GMT
నీ మీద ఒక ఫిర్యాదు ఉంది... లోకేష్ పై మోడీ చమత్కారం అలా ఉంది!
X

బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో లక్షల మంది హాజరైన భారీ బహిరంగసభ వేదికపై నుంచి సుమారు రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇందులో ప్రధానంగా.. విశాఖలో దక్షిణకోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ఇదే సమయంలో.. అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్లతో ఏర్పాటుచేయనున్న ఎన్.టీ.పీ.సీ. గ్రీన్ హైడ్రోజన్ హబ్, తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో రూ.2,193 కోట్లతో ఏర్పటయ్యే క్రిస్ సితీ, నక్కపల్లి వద్ద రూ.1,877 కోట్లతో ఏర్పాటుచేసే బల్క్ డ్రగ్ పార్క్ తో పాటు రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా... ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ ఏర్పాటు అవుతోందని. దీనివల్ల ఈ ప్రాంతంలోని వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయని.. పర్యాటక రంగానికీ ఊతం లభిస్తుందని అన్నారు. ఆ సంగతి అలా ఉంటే... సభా ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి - ఏపీ మంత్రి నారా లోకేష్ కి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

అవును... విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన సభాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సమయంలో సభా ప్రాంగణంలో మోడీ.. లోకేష్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందులో భాగంగా... ప్రధాని వేదికపైకి వెళ్లే మూందు లోకేష్ తో కాసేపు ముచ్చటించారు. ఇందులో భాగంగా... లోకేష్ నమస్కరించగానే... "నీ మీద ఒక ఫిర్యాదు ఉంది" అని మోడీ అన్నారు.

అనంతరం... "ఆ ఫిర్యాదు ఏమిటో మీకు కూడా తెలుసు కదా?" అని పక్కనే ఉన్న ఏపీ సీఎం, లోకేష్ తండ్రి చంద్రబాబు వైపు చూసి వ్యాఖ్యానించారు. తర్వాత ఆ సస్పెన్స్ కు తెరదించారు మోడీ. ఇందులో భాగంగా.. "ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయ్యింది.. ఇప్పటికీ ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు? కుటుంబతో వచ్చి నన్ను కలువు" అంటూ లోకేష్ భుజం తట్టి మోడీ ముందుకు కదిలారు.

ఈ సందర్భంగా ప్రధాని ఆసక్తికర ఆహ్వానంపై స్పందించిన లోకేష్... "త్వరలోనే వచ్చి కలుస్తా సార్" అని అన్నారు. దీంతో... ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.