Begin typing your search above and press return to search.

మితాహారి మోదీకి.. ధనిక బ్రూనై సుల్తాన్ వడ్డించిన మెనూ ఏమిటో తెలుసా?

బ్రూనై సుల్తాన్ ప్రస్తుత సంపద రూ.4 లక్షల కోట్లు అని అంచనా.

By:  Tupaki Desk   |   5 Sep 2024 5:30 PM GMT
మితాహారి మోదీకి.. ధనిక బ్రూనై సుల్తాన్ వడ్డించిన మెనూ ఏమిటో తెలుసా?
X

ఇప్పుడంటే ఎలాన్ మస్క్ లు.. వారెన్ బఫెట్ లు.. బిల్ గేట్స్.. గౌతమ్ అదానీల సంపద గురించి గొప్పగా చెప్పుకొంటున్నాం కానీ.. ఓ 30 ఏళ్ల కిందట బిల్ గేట్స్ ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియకముందు ప్రపంచ ధనవంతుడు ఎవరో తెలుసా? ఒకే ఒక్క బ్రూనై సుల్తాన్.. ఆయన దగ్గర ఉన్న అరుదైన కార్లు.. విలాసవంతమైన భవనాల గురించి కథలు కథలుగా మాట్లాడేవారు. అన్నిటికిమించి ఆ రోజుల్లో సొంతంగా విమానం ఉన్న అతి కొద్ది మందిలో బ్రూనై సుల్తాన్ ఒకరు. కాగా, కాలం మారి.. టెక్నాలజీ రంగం రంగంలోకి వచ్చేసరికి నయా ధనికులు పుట్టుకొచ్చారు. దీంతో బ్రూనై సుల్తాన్ ను మించిన సంపద పోగేసుకున్నారు.

4 లక్షల కోట్ల దగ్గరే..

బ్రూనై సుల్తాన్ ప్రస్తుత సంపద రూ.4 లక్షల కోట్లు అని అంచనా. అయితే, ఇది మస్క్ సంపదలో నాలుగో వంతు మాత్రమే కావడం గమనార్హం. కాగా, భారత ప్రధాని మోదీ రెండు రోజుల కిందట బ్రూనై వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనకు బ్రూనై సుల్తాన్‌ హస్సనల్‌ బోల్కివయా ఘనంగా ఆహ్వానం పలికారు. మరోవైపు బ్రూనైను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డులకెక్కారు. ముస్లిం దేశాల్లో బాగా పలుకుబడి ఉన్న బ్రూనై సుల్తాన్ తో భేటీ కావడం ఇరు దేశాల దౌత్య సంబంధాల‌ను బ‌లోపేతం చేసే పరిణామమే అని చెప్పాలి.

బంగారు పూత పూసిన ప్యాలెస్ లో..

బ్రూనైలో రెండు రోజుల పాటు సాగిన మోదీ పర్యటనలో సుల్తాన్‌ బోల్కియా వడ్డించిన మెనూ ఏమిటా? అనే చర్చ సహజం. బంగారు పూత పూసిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ లో జీవించే.. కేవలం తన క్షవరం కోసమే వేరే దేశం వెళ్లి రూ.లక్షలు ఖర్చు పెట్టే సుల్తాన్ ఏం ఆతిథ్యం ఇచ్చారో కూడా అందరూ చూస్తారు. అందుకే ఈ వివరాలను భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ప్రసిద్ధ భారతీయ వంటకాలతో పాటు భారత జాతీయ జెండాను తలపించే రంగులతో వంటకాలను తయారు చేశారని పేర్కొంది. స్టార్టప్ గా అవకాడో, దోసకాయ, ఆస్పరాగస్, ముల్లంగి పచ్చడి వడ్డించారని.. తర్వాత క్రిస్పీ టోర్టిల్లా, బ్రోకలీతో లెంటిల్‌ సూప్‌ అందించారని వివరించింది. వెజిటబుల్ క్విచ్, స్పినాచ్, ఫారెస్ట్ మష్రూమ్ విత్ బ్లాక్ ట్రఫుల్, గుమ్మడికాయ, గ్రీన్‌ పురీ లను మూడో కోర్సుగా ఉన్నాయని పేర్కొంది. గ్రీన్‌ పీస్‌ పూరీలో త్రివర్ణ పతకం స్ఫురించేలా ఆకర్షణీయ రంగులతో సర్వ్‌ చేశారు.

ఇదే మెనూలో జీరా రైస్, చానా మసాలా, వెజిటబుల్ కోఫ్తా, భిండి టామటర్, గ్రిల్డ్ పీతలు, టాస్మానియన్ సాల్మన్, కొబ్బరి బార్లీ రిసోట్టోతో రొయ్యల స్కాలోప్స్ కూడా ఉన్నాయట. మామిడి పేడా, మోతీచూర్‌ లడ్డూ, సూర్తి ఘరీ పిస్తా తదితర భారత స్వీట్‌ డెజర్ట్‌ లను వడ్డించారట. అంతేగాక వీటిని కళ్లు మిరుమిట్లు గొలిపే మెరూన్‌, బంగారు డిజైన్‌ ప్లేట్‌ లలో సర్వ్ చేసినట్లు చెబుతున్నారు. ఇక్కడ గమ్మత్తేమంటే.. మోదీ చాలా మితాహారి. రాత్రివేళ మరీ డైట్ పాటిస్తారు. స్వీట్లలో గుజరాతీ స్వీట్ ను ఇష్టపడతారు. అలాంటాయనకు ఘనమైన విందు ఇచ్చారు బ్రూనై సుల్తాన్.