ఆరెస్సెస్ గురించి మోడీ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నది వందేళ్ళ క్రితం ఏర్పాటు అయింది. 1925లో ఏర్పాటు అయిన ఆరెస్సెస్ కి ఇపుడు శత వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 22 Feb 2025 3:47 AM GMTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నది వందేళ్ళ క్రితం ఏర్పాటు అయింది. 1925లో ఏర్పాటు అయిన ఆరెస్సెస్ కి ఇపుడు శత వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ తో ఆ వందేళ్ళ పండుగ పూర్తి అవుతుది. ఇదిలా ఉంటే తాను ఆరెస్సెస్ లో భాగమని ఆరెస్సెస్ లో తానూ అనుబంధం కావడం అదృష్టమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఢిల్లీలో జరిగిన ఆరెస్సెస్ శత వసంతాల ఉత్సవ వేడుకలలో మోడీ ఆరెస్సెస్ గురించి గొప్పగా చెప్పడం విశేషం. ఆరెస్సెస్ ఈ దేశంలో మర్రి చెట్టులా ఊడలు వేసుకుంటూ మరీ విస్తరించిందని ఆయన అభివర్ణించారు. ఆరెస్సెస్ ని మరాఠీ వ్యక్తి వందేళ్ళ క్రితం స్థాపించారని గుర్తు చేశారు. ఆనాడు ఒక్కరితో మొదలైన ప్రాయాణం ఈ రోజు లక్షలాది కోట్లాది మందికి తాకి తరం తరం ముందుకు సాగుతోందని అన్నారు.
ఆరెస్సెస్ భారతీయ విలువలు సంప్రదాయాలను అలాగే దేశం యొక్క సంస్కృతిని రానున్న తరాలకు భావి తరాలకు కూడా చాటి చెబుతోందని అన్నారు. ఈ విషయంలో ఆరెస్సెస్ కృషి ఎన్నతగినది అని మోడీ అన్నారు. ఆరెస్సెస్ అంటేనే లక్షలాది మందికి స్పూర్తి అని మోడీ చెప్పారు. ఆరెస్సెస్ చేసిన అనేక సేవా కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.
ఇదిలా ఉంటే బీజేపీ విజయాల వెనక ఆరెస్సెస్ ఉంది అన్నది తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అందుకు మచ్చు తునక. అంతే కాదు మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో కూడా బీజేపీని ఆరెస్సెస్ క్షేత్ర స్థాయిలో చేసిన ప్రచారం వ్యూహాలతో గెలిపించింది అని ప్రచారంలో ఉంది.
అలాగే పశ్చిమ బెంగాల్ లో కూడా అరెస్సెస్ పది రోజుల కార్యక్రమాన్ని చేపడుతూ ముందుకు సాగుతోంది ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అక్కడ సదస్సులలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు మోడీ ఆరెస్సెస్ కి కితాబు ఇవ్వడాన్ని రైటిస్ట్ ఫిలాసఫీని అభిమానించేవారు అంతా మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో లెఫ్టిస్టు భావజాలం కలిగిన వారు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
ఆరెస్సెస్ సేవా సంస్థగా ముందుకు సాగుతోందని రైటిస్టులు అంటూంటే ఆరెస్సెస్ భావజాలాన్ని విపక్షాలు తప్పుపడుతూంటాయి. అయినా వందేళ్ళుగా ఆరెస్సెస్ తనదైన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఎన్నో సార్లు నిషేధానికి కూడా గురి అయింది. అయితే ఈ రోజు దేశాన్ని ఏలుతున్న బీజేపీ వెనక స్పూర్తి కూడా ఆరెస్సెస్. ప్రధాని మోడీ సైతం ఆరెస్సెస్ లో పనిచేసారు. అందుకే ఆయన శత వసంత వేడుకలలో పాల్గొని తన అనుభవాలను వల్లె వేసుకున్నారు. ఆరెస్సెస్ ని వేన్నోళ్ళ ఆయన పొగిడారు.