హలో ట్రంప్...మోడీ తొలి ఫొన్ కాల్
దీంతో పెద్ద ఎత్తున అమెరికాలో నివసిస్తున్న భారతీయుల మీద ఈ నిర్ణయం ప్రభావం పడుతోంది. అలాగే అక్రమ వలసల మీద ట్రంప్ గురి పెట్టారు.
By: Tupaki Desk | 28 Jan 2025 3:48 AM GMTఅగ్ర రాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ కి తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హలో ట్రంప్ అంటూ ఫోన్ చేసి ముచ్చటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల అధినేతలు చాలా కీలక విషయాలనే ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు అని అంటున్నారు.
రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయినందుకు మోడీ ట్రంప్ ని ఫోన్ లో అభినందించారు. ఆ మీదట భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల మీదనే చర్చ సాగింది అని అంటున్నారు. ఇక చూస్తే ట్రంప్ దూకుడు మామూలుగా లేదు. ఆయన రెండోసారి అధ్యక్షుడు కాగానే వరసబెట్టి కీలక పత్రాల మీద సంతకాలు చేశారు. ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో జన్మతహా అమెరికాలో పుట్టిన వారికి లభించే పౌరసత్వం హక్కుని రద్దు చేస్తూ కూడా సంచలన నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు.
దీంతో పెద్ద ఎత్తున అమెరికాలో నివసిస్తున్న భారతీయుల మీద ఈ నిర్ణయం ప్రభావం పడుతోంది. అలాగే అక్రమ వలసల మీద ట్రంప్ గురి పెట్టారు. అమెరికా వీసా కోసం ఇక మీదట ఏకంగా నాలుగు వందల రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. వీసా ఆలస్యం వల్ల భారత్ అమెరికాల మధ్య వాణిజ్యంతో పాటు పర్యాటక రంగం ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని కూడా నిపుణులు అంటున్నారు.
అయితే ట్రంప్ తీసుకున్న అక్రమ వలసల నియంత్రణకు భారత్ మద్దతుగానే ఉంది. న్యాయపరంగా సరైన పత్రాలతో అమెరికా వెళ్ళేవారికే తమ మద్దతు ఉంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్ళిన వారిని తిరిగి రప్పించేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉందని అంటున్నారు.
అయితే ట్రంప్ తీసుకునే మరి కొన్ని నిర్ణయాలు మాత్రం భారత్ ప్రయోజనాలకు ముడిపడి ఉన్నాయి. బహుశా అమెరికా ప్రెసిడెంట్ తో తొలి ఫోన్ సంభాషణలో మోడీ క్లుప్తంగా మాట్లాడినా ఆయన తొందరలోనే అమెరికా సందర్శన చేస్తారని అపుడు ఉభయ దేశాధినేతలూ చాలా అంశాల మీద ముఖా ముఖీ సంభాషించుకుంటారని అంటున్నారు.
ఇక ట్రంప్ మోడీ మంచి మిత్రులుగా ఉన్న నేపధ్యం ఉంది. దాంతో భారత్ కి అమెరికా నిర్ణయాల పరంగా పెద్దగా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. చూడాలి మరి తొలి హలో ఏ రకమైన దౌత్య బంధానికి దారి తీస్తుందో ఏ రకమైన మునుపటి స్నెహ బంధాన్ని బలోపేతం చేస్తుందో అన్నది.