Begin typing your search above and press return to search.

'విశ్వగురు' సత్తాకు మాయని మరక

తనను తాను గొప్పగా ప్రజెంట్ చేసుకోవటానికి ప్రధాని నరేంద్ర మోడీ పడే తపన అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 5:29 AM GMT
విశ్వగురు సత్తాకు మాయని మరక
X

తనను తాను గొప్పగా ప్రజెంట్ చేసుకోవటానికి ప్రధాని నరేంద్ర మోడీ పడే తపన అంతా ఇంతా కాదు. భారత్ ను విశ్వగురువుగా కీర్తించే ఆయన.. మిగిలిన వారంతా తనను విశ్వగురుకు ప్రతిరూపంగా చూడాలని తపించటం కనిపిస్తుంది. ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రధానులు.. పలు దేశాల అధ్యక్షుల్ని ఆత్మీయంగా హత్తుకోవటమే కాదు.. చనువుగా వారి వెన్ను మీద చరిచే తీరును ఆయన గొప్పలకే కేరాఫ్ అడ్రస్ గా చూపించటం తెలిసిందే.

ట్రంప్ లాంటి వాడిని సైతం గాఢంగా ఆలింగనం చేసుకోవటమే కాదు.. ఆయన వెన్ను మీద మూడు నాలుగుసార్లు చరిచే దమ్ము.. ధైర్యం మోడీ సొంతంగా చిట్టి వీడియోలతో బీరాలు పలకటం.. ఉక్కు ఛాతీకి ప్రతిరూపంగా మోడీని అభివర్ణించటం చూస్తుంటాం. మరి.. అలాంటి పెద్ద మనిషి దేశ ప్రధానిగా ఉన్న వేళలో.. అమెరికా నుంచి అక్రమ వలసల పేరుతో అనాగరికంగా.. పశువుల మాదిరి భారత్ కు పంపిన తీరుపై సరైన రీతిలో ఖండించలేని తీరును ఏమనాలి?

అమెరికా మాదిరి భారతదేశం అగ్రరాజ్యం కాకపోవచ్చు. వారికున్నంత శక్తి లేకపోవచ్చు. తినేందుకు తిండి లేని బీద బతుకులు కోట్లల్లో ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఆత్మాభిమానం అయితే ఉందిగా? అది కూడా లేనంత దారుణ స్థితిలో మనం ఉన్నామా? అమెరికా మనకు శత్రుదేశమై.. ఆ దేశ తీరు ఇప్పుడున్నట్లుగా ఉంటే అదో పద్దతి. అమెరికాకు అత్యంత మిత్రదేశంగా.. నమ్మకస్తుడైన స్నేహితుడిగా చెప్పుకునే వేళలో.. స్నేహితుడి దేశానికి చెందిన అక్రమ వలసల విషయంలో ఇంత నిర్దయగా ఎందుకు వ్యవహరించినట్లు?

తెంపరితనంతో స్నేహితుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. అన్ని మూసుకొని కూర్చునే కన్నా.. లాగిపెట్టి ఒక్కటిచ్చినట్లుగా రియాక్టు అయితే జరిగే నష్టమేంటి? మిత్రుడి హోదాలో స్నేహాన్ని ఎంజాయ్ చేసే అగ్రరాజ్యానికి.. తేడా వస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్న విషయాన్ని శాంపిల్ గా అయినా చేసి చూపించాలి కదా? యూఎస్ ఎంబసీకి చెందిన ప్రముఖుడ్ని పిలిపించి.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పంపటంతో పాటు.. వెనువెంటనే ఎఫెక్టు చూపే చర్యల్ని ఎందుకు తీసుకోకూడదు. భారతదేశంలోని చిన్న చిన్న రాష్ట్రాలకు సరిపోయే దేశాలు సైతం.. అమెరికా అహంకారం శ్రుతిమించిన ప్రతి సందర్భంలోనూ సీరియస్ అవుతున్న దానికి బదులుగా మౌనంగా ఉండటం ఏమిటి?

మౌన ప్రధానిగా పేరున్న దివంగత మన్మోహన్ సింగ్ హయాంలో.. అమెరికా ధోరణికి నిరసన వ్యక్తం చేయటానికి భారత సర్కారు అప్పుడే అంతలా సీరియస్ అయినప్పడు.. పదేళ్లుగా నాన్ స్టాప్ ప్రధానిగా పని చేసి.. అంతర్జాతీయంగా మరే భారత ప్రధానికి లేని ఇమేజ్ ను సొంతం చేసుకున్ మోడీ రాజ్యంలో తెంపరితనానికి ట్రంప్ తెగబడటం దేనికి నిదర్శనం? అలా జరిగిన తర్వాత.. అందరూ విమర్శించే వరకు విషయాన్ని తీసుకొచ్చిన మోడీ సర్కారు.. ఇప్పటికీ స్పందించక, మీనమేషాలు లెక్కించటం దేనికి నిదర్శనం?

నరేంద్ర మోడీ ఉక్కుఛాతీ గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు.. దేశ పౌరుల్ని జంతువుల మాదిరి ట్రీట్ చేసిన అగ్రరాజ్య అహంకారానికి సరైన రీతిలో సమాధానం ఇవ్వలేని దైన్యం దేనికి నిదర్శనం? చరిత్రలో తనను తాను గొప్పవాడిగా నిలవాలన్న తపనను ప్రదర్శించే మోడీ.. ఈ రోజున మాయని మచ్చను తుడుచుకునేందుకు సైతం సిద్ధం కాకపోవటం చూసినప్పుడు.. మన పాలకులు ఇంకా బానిస మైండ్ సెట్ నుంచి బయటకు రాలేదేన్న భావన కలగటం ఖాయం. కాదంటారా?