బెంగళూరు మీటింగ్ పై మోడీ కామెంట్స్
ముఖ్యంగా బెంగళూరులో కాంగ్రెస్ నేతృత్వం లో 26 విపక్ష పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మోడీ ఆయా పార్టీలపై నిశిత విమర్శలు చేశారు.
By: Tupaki Desk | 18 July 2023 7:16 AM GMTవిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా బెంగళూరులో కాంగ్రెస్ నేతృత్వం లో 26 విపక్ష పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మోడీ ఆయా పార్టీలపై నిశిత విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలతో ఈ దేశానికి జరిగిన లాభం ఏమీలేదని.. ప్రజలకు జరిగిన మేలు కూడా ఏమీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
పోర్టు బ్లెయిర్‌లోని వీరసావర్కర్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చ్యువల్‌గా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. అవినీతి మయమైన పార్టీలు చేతులు కలుపుతున్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల పాలన ప్రజలకు మేలు చేయదని అన్నారు.
ఇదే సమయంలో బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల కూటమి సమావేశాలను ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. ఆయా పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.
సొంత లాభం కోసమే విపక్షాలు పని చేశాయని అన్నారు. కొన్ని పార్టీలు ఏళ్లకు ఏళ్లు కుటుంబాల కోసమే పని చేస్తున్నాయని.. UPA హయాంలో గిరిజనుల అభివృద్ధిని విస్మరించారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నినాదం 'కుటుంబం - వారి కోసం' మాత్రమేనని పేర్కొన్నారు.
తమిళనాడులో అవినీతి కేసులు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు డీఎంకేకు క్లీన్ చిట్ ఇచ్చాయని, ఆ పార్టీతో చేతులు కలిపాయని ఎద్దేవా చేశారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస గురించి మాట్లాడడం లేదని, అక్కడ బీజేపీ నాయకులపై అధికార పార్టీ దాష్టీకానికి పాల్పడినా ఎవరికీ కనిపించలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.
యూపీఏ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దామని.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. వారి మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టేనని వ్యాఖ్యానించారు.