విపక్షం కామన్ అజెండా అదే...మోడీ అందుకే హ్యాపీ...?
విపక్షానికి కామన్ అజెండా
By: Tupaki Desk | 18 July 2023 10:41 AM GMTవిపక్షానికి కామన్ అజెండా ఉందా అన్న డౌట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అధికారాన్నే కోరుకుంటోంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. అయితే తాజాగా బెంగళూరు లో 26 పార్టీలు సమావేశం అయ్యాయి. ఆయా పార్టీలకు కామన్ అజెండా ఉందా అన్నదే పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది.
అయితే ఒకే ఒక కామన్ అజెండాతో అన్ని పార్టీలు అక్కడ కలిశాయి. అదేంటి అంటే ఈడీ సీబీఐ దాడులు. ఈ విషయం వారూ వీరూ తేడా లేకుండా అన్ని పార్టీలను ఒక్క త్రాటిన కలిసిపోయేలా చేసింది. వరసబెట్టి అందరి మీద ఈడీ దాడులు సీబీఐ దాడులు కేంద్రంలోని బీజేపీ చేయడం కామన్ అయిపోయింది. దాంతో నిన్న వారు రేపు మనం ఊరుకుంటే ముప్పు మనకే ముంచుకుని రావచ్చు అన్నదే ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చింది.
దాంతో అంతా కలసి పాట్నాలో మీటింగ్ పెట్టినా బెంగళూరుకి షిఫ్ట్ అయినా కూడా అదే వారి కామన్ అజెండాగా ఉంది. దానిని మించి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా అన్నదే చర్చకు వస్తోంది. అయితే విపక్ష కూటమిలోని నాయకులు దేశం ఒక్కటిగా ఉంచడం, సర్వ మత సౌభాతృత్వం, సమానత్వం, రాజ్యాంగం ప్రకారం అందరికీ సమ న్యాయం అంటూ పెద్ద పడికట్టు పదాలనే వల్లె వేస్తున్నారు
ఇక విపక్ష కూటమిలో ఒక ప్రతిపాదన వచ్చినా అది అమలు అయ్యేది ఎంతవరకూ అన్నది మరో సీరియస్ చర్చ. బీజేపీకి ప్రత్యర్ధిగా కూటమి నుంచి ఒకరినే నిలపాలన్నది ఆ ప్రతిపాదన. అయితే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రత్యర్ధిగా ఉన్నా ధీటుగా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ వామపక్షాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కలసి ఒక్కరే అభ్యర్ధిని నిలబెట్టడం జరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది.
అలాగే యూపీలో ఎస్పీ పెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకే బీజేపీ మీద పోరు బాధ్యతలు అప్పగించి మద్దతు పార్టీగా కాంగ్రెస్ ఉండగలదా. ఢిల్లీలో పంజాబ్ లో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీకే పెత్తనం ఇచ్చేసి కాంగ్రెస్ ఊరుకుంటుందా అన్నది చూడాలి. అలాగే గుజరాత్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, అస్సాం వంటి చోట్ల కాంగ్రెస్ కే పూర్తి పగ్గాలు ఇచ్చి మిగిలిన పార్టీలు ఊరుకుంటాయా అంటే ఇవన్నీ మాటలు కాదు, ఆచరణలో కుదరడం అంటే కష్టమే అని అంటున్నారు.
మరో వైపు చూస్తే విపక్షాలు కలిశాం అన్నది ప్రధానం కాదు, దేశానికి పనికి వచ్చే కామన్ ప్రోగ్రాం ఏదీ అన్నది చూడాల్సి ఉంది. ఎవరికీ అర్ధం కాని నినాదాలను పట్టుకుని కూర్చుంటే కుదరదు అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కానీ ఎన్డీయే కూటమి కానీ 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్ చేస్తామని చెబుతోంది. అదే విధంగా దేశంలో పేదరికం నిర్మూలిస్తామని, దేశన్ని అతి పెద్ద ఆర్ధిక శక్తిగా రూపుదిద్దుతామని చెబుతున్నారు.
దేశంలో ఉగ్రవాదానికి చోటు లేకుండా చూస్తామని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి విదేశాలలో పెరిగిన కీర్తిని అగ్ర రాజ్యాలు ఆయన కోసం ఎదురుచూస్తున్న విషయాలను బీజేపీ ప్లస్ పాయింట్ గా చెప్పుకుంటుంది. కానీ విపక్ష కూటమికి మోడీ సరిసాటి గా నిలిచే ప్రధాని అభ్యర్ధి ఎవరు అన్నదే చర్చకు వస్తోంది. నితీష్ కుమార్ పట్ల కాంగ్రెస్ కొంత మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. కానీ ఆ కీలక పదవి మీద మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అలాగే వృద్ధ నేత శరద్ పవర్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సహా చాలా మంది లిస్ట్ ఉంది. వారంతా నితీష్ కుమార్ కి జై కొట్టేసి సైలెంట్ గా ఊరుకోరు.
తమకు ప్రధాని పదవి మీద ఆశ లేదని కాంగ్రెస్ చెప్పినా బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తుంది, అలాంటపుడు బలహీన ప్రధానితో ఈ దేశాన్ని నడపడానికి ప్రజలు ఎంతవరకూ అంగీకరిస్తారు. అసలు ఈ కలగూర గంపకు జనాల ఆమోదం ఏ మేరకు ఉంటుంది అన్నవన్నీ ప్రశ్నలే. ఏది ఏమైనా ఒక్క విషయంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. అంతా కలసి రెండు మీటింగ్స్ దాకా వచ్చారు. ఇపుడున్న పరిస్థితుల్లో మోడీ మీద ఎదురుదాడి చేసేందుకు అంతా కలవడం అన్నది ఒక కీలక పరిణామంగానే చూడాలి. అయితే ఇది రాజకీయ పరిణామంగానే ఉంటుంది తప్ప జనామోదం అన్నది ఎంతవరకూ అంటే ప్రశ్నగా ఉంటుంది.