Begin typing your search above and press return to search.

నిజంగా 'ఎన్నోసార్లు..' సిగ్గు చేటే మోడీ స‌ర్‌!

నిజానికి భార‌త ప్ర‌జ‌లు సిగ్గు ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు

By:  Tupaki Desk   |   21 July 2023 5:21 AM GMT
నిజంగా ఎన్నోసార్లు..  సిగ్గు చేటే మోడీ స‌ర్‌!
X

ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లో తాజాగా వెలుగు చూసిన ఇద్ద‌రు మ‌హిళ‌ల వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.. ఈ ఘ‌ట‌న 140 కోట్ల మంది భార‌తీయుల‌ను సిగ్గుప‌డేలా చేసింద‌ని వ్యాఖ్యానించారు. దీనిని వ‌దిలి పెట్ట‌బోమ‌ని.. నిందితులు ఎంత‌టి వారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని ఆయ‌న భ‌రోసా కూడా ఇచ్చారు. అయితే.. నిజానికి భార‌త ప్ర‌జ‌లు సిగ్గు ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు గ‌త రెండున్న‌రేళ్ల‌లో మ‌రీ ముఖ్యంగా ఈ 9 ఏళ్ల కాలంలో ఎన్నో జ‌రిగాయ‌ని మేధావులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తారీకులు ద‌స్తావేజుల స‌హా వారు ఆయా ఘ‌ట‌న‌ల‌ను తెర‌మీదికి తెస్తున్నారు.

+ ప్ర‌పంచ చ‌రిత్ర‌లో భార‌త ఖ్యాతిని ఇనుమ‌డింపజేసిన మ‌న దేశ రెజ్ల‌ర్ల‌ను న‌డిరోడ్డుపై ఈడ్చేసిన‌ప్పుడు సిగ్గు పోలేదా? క‌నీసం దీనిపై స్పందించేందుకు మోడీకి స‌మ‌యం లేదా? భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడిపై తీవ్ర లైంగిక వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తిన‌ప్పుడు.. క‌నీసం ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసేందుకు మీన‌మేషాలు లెక్కించారే.. అప్పుడు ఏమైంది ఈ సిగ్గు? పైగా ఆయ‌నపై బెయిలబుల్ సెక్ష‌న్లు న‌మోదు చేశారు క‌దా.. అప్పుడు లేదా?!

+ 75 రోజులుగా మ‌ణిపూర్ అట్టుడుకుతోంద‌ని.. ఇళ్ల నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. పొరుగు ప్రాంతాల‌కు ప్రాణాలు అర‌చేత‌బ‌ట్టుకుని త‌ర‌లి పోతున్నార‌ని.. ప్ర‌పంచ మీడియా ఎలుగెత్తిన‌ప్పుడు..క‌నీసం స్పందించే స‌మ‌యం కూడా లేకుండా పోయిందా విశ్వ గురూ! అప్పుడు పోలేదా సిగ్గు!

+ క‌ర్ణాట‌క‌లో హిజాబ్ ఘ‌ట‌న‌ను బీజేపీ నేత‌లు పెంచి పోషించార‌ని.. ముస్లిం వ‌ర్గానికి చెందిన యువ‌తుల‌పై విచ‌క్ష‌ణా రహితంగా దాడులు చేశార‌ని అప్ప‌టి ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌లు చేసి బంద్‌ల‌కు పిలుపునిచ్చిన‌ప్పుడు ఏమంది స‌ర్‌?!

+ ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నికై.. పొత్తులు పెట్టుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న మ‌హారాష్ట్ర శివ‌సేన‌-కాంగ్రెస్‌-ఎన్సీపీల కూట‌మి స‌ర్కారును నిట్ట‌నిలువునా కూల్చేసిన‌ప్పుడు.. అంత‌ర్గ‌త మందిరాల్లో అట్ట‌హాసంగా సంబ‌రాలు చేసుకున్న‌ప్పుడు.. ప్ర‌జాస్వామ్య భార‌తి త‌ల‌దించుకునే ప‌రిస్థితి క‌ల్పించినందుకు సిగ్గు ప‌డే అవ‌కాశం రాలేదా?

+ గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై బీబీసీ డాక్య‌మెంట‌రీని నిమిషాల వ్య‌వ‌ధిలో తొల‌గించేసి.. అస‌లుకు ముసుగేసే ప్ర‌య‌త్నం చేసి.. ప్ర‌పంచం ముందు మీడియా స్వేచ్ఛ‌పై గంట‌ల త‌ర‌బ‌డి లెక్చ‌ర్లు ఇచ్చిన‌ప్పుడు.. సిగ్గు ప‌డాల్సి వ‌చ్చింది స‌ర్‌!

+ గౌతం అదానీపై హిండెన్‌బ‌ర్గ్ నివేదిక వెల్ల‌డించిన ఆర్థిక కుంభ‌కోణాలు.. అక్ర‌మాల‌ను స‌మ‌ర్థించేందుకు ప‌డరాని పాట్లు ప‌డిన‌ప్పుడు కూడా ఈ దేశం సిగ్గు ప‌డాల్సి వ‌చ్చింది విశ్వ‌గురూ!

+ పొరుగు పార్టీల్లో అవినీతి అక్ర‌మార్కులు.. కాషాయ కండువా క‌ప్పుకోగానే విక్ర‌మార్కులు అయిపోయిన తీరు.. భార‌త ప్రజాతంత్రానికి నిజంగానే సిగ్గు చేటు కాలేదా? స‌ర్‌!

+ గుజ‌రాత్ గోద్రా అల్ల‌ర్ల విష‌యంలో తీస్తా సెత‌ల్వాడ్‌పై అక్ర‌మ కేసులు పెట్టార‌న్న సుప్రీంకోర్టు నిల‌దీత‌లు.. అస‌లు ఇవి ఉద్దేశ పూర్వ‌కంగా పెట్టిన కేసులేన‌ని నిలదీసిన తీరు.. యావ‌త్ గుజ‌రాత్‌నేకాదు.. యావ‌త్ భార‌తావ‌నినీ సిగ్గు ప‌డేలా చేయ‌లేదా?

+ న‌చ్చ‌నివారు.. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌ని వారిపై సీబీఐ, ఈడీల‌ను తోలి.. దాడులు చేయించి.. న‌డిరోడ్డుపై నిల‌బెట్టిన‌ప్పుడు.. దేశంలో ఇలా కూడా జ‌రుగుతుందా? అని నిజంగానే పౌరులు సిగ్గు ప‌డ‌లేదా? మోడీ స‌ర్‌!

+ 300 మంది అమాయ‌కులు.. రైలు ప్ర‌మాదానికి గురై అమూల్యమైన ప్రాణాల‌ను పోగొట్టుకుంటే.. క‌నీస బాధ్య‌త ప‌ట్ట‌ని కేంద్ర స‌ర్కారును చూసి, ఏమాత్రం తొణుకు బెణుకు లేని పాల‌న‌ను చూసి ప్ర‌పంచ‌మే సిగ్గు ప‌డిపోయింది క‌దా స‌ర్‌!

+ మోడీ ఇంటి పేరుపై చేసిన రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను కూడా `రాజ‌కీయ క‌క్ష సాధింపు` ప్ర‌క్రియ‌ను వాడుకున్న తీరు భార‌త రాజ‌కీయాల‌ను సిగ్గుప‌డేలా చేయ‌లేదా? మోడీ స‌ర్‌!

ఇలాంటివి ఎన్నో సంఘ‌ట‌న‌లు.. కాగా.. నేడు మ‌ణిపూర్ ఘ‌ట‌న‌.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర‌గ‌డం.. కాళ్ల కింద‌కు వ‌ర‌ద చొచ్చుకురావ‌డంతో `సిగ్గు` గుర్తుకురావ‌డం ఒక్క‌టే నిలిచిపోయింది!! - అని మేధావి వ‌ర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి.