Begin typing your search above and press return to search.

కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ తీయాలి!

మణిపూర్‌ లో బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం ఉంటే

By:  Tupaki Desk   |   24 July 2023 5:46 AM GMT
కశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్లే మణిపూర్ ఫైల్స్ తీయాలి!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మణిపూర్ లో జరుగుతున్న ఘర్షణలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం మణిపూర్ కి సంబంధించిన చర్చలే కొనసాగుతున్నాయి. ఇది పూర్తిగా అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ ఉన్న బీజేపీ "డబుల్ ఇంజిన్" ఫెయిల్యూర్ అని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదే సమయంలో తాజాగా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం మోడీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా శివసేన పార్టీ పత్రిక "సమ్నా"లో సంపాదకీయం రాసింది. ఇందులో మోడీ ప్రభుత్వంపై నిప్పులు కక్కుతూనే.. సెటైర్లు పేల్చింది. దీంతో... బీజేపీ సర్కార్ అసమర్ధతను శివసేన తీవ్రస్థాయిలో ఎత్తి చూపే ప్రయత్నం చేసిందని అంటున్నారు.

అవును... మణిపూర్‌ లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎండగట్టింది. ఈ సందర్భంగా... "కాశ్మీర్ ఫైల్స్" తరహాలోనే "మణిపూర్ ఫైల్స్" పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది.

ఈ సందర్భంగా... మణిపూర్‌ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరింగించిన దృశ్యాలతో కూడిన వీడియో వెలుగుచూసిన విషయాన్ని సంపాదకీయం ప్రస్తావించిన సామ్నా... మణిపూర్‌ ను కుదిపేస్తున్న హింసాకాడకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ బాధ్యత వహించాలని సూచించింది.

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఉదంతాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి ఉండకపోతే... మోడీ అసలు పెదవి విప్పే వారే కాదని ఈ సందర్భంగా సామ్నా పత్రిక సంపాదకీయంలో ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇదే సమయంలో మణిపూర్‌ లో బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం ఉంటే ఈపాటికే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఉండేవారని సామ్నా తన ఎడిటోరియల్ లో అభిప్రాయపడింది. ప్రధాన మంత్రి దృష్టిలో మణిపూర్‌ కు ఏమాత్రం రాజకీయంగా ప్రాధాన్యత లేదని, ఆ కారణంగానే ఆ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్ని విమర్శించింది.

ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో "ది కశ్మీర్ ఫైల్స్", "తాష్కెంట్ ఫైల్స్", "ది కేరళ సోర్టీ" చిత్రాలు రూపొందాయని గుర్తు చేసిన సామ్నా... మణిపూర్ హింసాకాండపై కూడా ఆ వ్యక్తులే ఇప్పుడు "మణిపూర్ ఫైల్స్" సినిమా తీయాలని సూచించింది. ప్రస్తుతం ఈ సంపాదకీయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యిందని తెలుస్తుంది.