'ఇండియా'పై ప్రధాని మోడీ షాకింగ్ కామెంట్లు
బ్రిటిషర్ల కాలంలో ఈస్ట్ ఇండియా అని ఒక సంస్థ వచ్చింది. అది దేశాన్ని మింగేసింది'' అని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 25 July 2023 10:10 AMకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా(I N D I A)పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్లు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభలు పదే పదే వాయిదా పడుతున్న విష యం తెలిసిందే. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపై కాంగ్రెస్ సహా విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి.
అయితే.. దీనికంటే ముందుగా విపక్ష పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దారుణాలపై చర్చించాలని అధికార పక్షం పట్టుబడుతోంది. దీంతో సభల్లో గందరగోళం ఏర్పడి వాయిదా పడుతున్నాయి.
ఈ క్రమంలో ఇరు సభల్లోనూ బీజేపీ ఎంపీలు ఎలా వ్యవహరించాలనే విషయంపై తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీకి చెందిన 300 మంది ఎంపీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ''ఇండియా అనేది ఆటంక వాదులు పెట్టుకున్న పేరు. బ్రిటిషర్ల కాలంలో ఈస్ట్ ఇండియా అని ఒక సంస్థ వచ్చింది. అది దేశాన్ని మింగేసింది'' అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ''ఈస్ట్-ఇండియా నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత.. ఇండియన్ మొజాహిద్దీన్ అనే సంస్థ కూడా వచ్చింది. దీనివల్ల కొన్ని వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఆటంకవాదులుగా మారి .. మారణ హోమం సృష్టించారు. వీరి నుంచి కూడా దేశాన్ని కాపాడుకుంటున్నాం. ఇప్పుడు 'ఇండియా' నుంచి కూడా దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది'' అని ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.