Begin typing your search above and press return to search.

లైవ్ అప్ డేట్స్: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం..!

కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన అస్త్రం

By:  Tupaki Desk   |   26 July 2023 8:09 AM GMT
లైవ్ అప్ డేట్స్: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం..!
X

కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్రయోగించేందుకు విపక్ష కూటమి "ఇండియా" సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు లోక్‌ సభ కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపట్టేందుకు స్పీకర్ కు నోటీసులిచ్చారు. కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అవును... మణిపుర్‌ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి "ఇండియా".. కేంద్ర ప్రభుత్వంపై "అవిశ్వాస తీర్మాన" అస్త్రం ప్రయోగించింది. మణిపూర్ వ్యవహారంపై మోడీని స్పందింపచేయడమే వారి లక్ష్యమని తెలుస్తుంది!

బీఆరెస్స్ స్పెషల్ తీర్మానం... నామా రియాక్షన్:

ఈ సమయంలో బీఆరెస్స్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. బీఆరెస్స్ నుంచి అవిశ్వాస తీర్మానం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. అనంతరం స్పందించిన నామా... “మా పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం పెట్టాం. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నేతలంతా మణిపూర్‌ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడితే శాంతి నెలకొంటుంది.అందుకే మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం” అని అన్నారు.

మాది సెపరేట్ తీర్మానం... బీఆరెస్స్ ఎంపీ రంజిత్ రెడ్డి:

అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం బీఆరెస్స్ కూడా తీర్మానం పెట్టడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈ విషయాలపై బీఆరెస్స్ ఎంపీ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ “అవిశ్వాసం”తో తమకు సంబంధం లేదని తాము విడిగా ప్రవేశపెట్టామని తెలిపారు.

బీఆరెస్స్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి... తమ అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా మద్దతు పలికారని.. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రతిపక్షం.. ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదు.. అని స్పష్టం చేశారు. అనంతరం మణిపూర్ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలి.. అని ఆయన అసలు ఎందుకు మాట్లాడడం లేదు అని నిలదీశారు.

మోడీ దుమ్ముదులుపుతారంటున్న జీవీఎల్:

ఈ విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. కేంద్రం‌పై అవిశ్వాస తీర్మానం విపక్షాల వెర్రికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. సంఖ్యా పరంగా అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని చెప్పారు. బీజేపీ ఎన్డీఏకి 330 పైగా సంఖ్యాబలం ఉందని అన్నారు. అవిశ్వాసం‌పై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాల దుమ్ము దులుపుతారని జీవీఎల్ అన్నారు.

తీర్మానాన్ని వ్యతిరేకించిన వైసీపీ..!:

ఇదే విషయంపై వైసీపీ ఎంపీ స్పందించారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ అంశం మీద హోం మంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని, సమాధానం చెబుతానని అన్నారని విజయసాయి చెప్పారు.

నెంబర్ ముఖ్యం కాదు... మండుతోందంటూ ఆర్జేడీ కీలక వ్యాఖ్యలు!

ఇదే సమయంలో ఆర్జేడీ నేతలు స్పందించారు. ఈ సందర్భంగా... సంఖ్యా బలం మాకు అనుకూలంగా లేదని తెలుసు. కానీ, ప్రజాస్వామ్యం కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు. మణిపూర్ మండుతోంది. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారని వేచి ఉన్నారు. బహుశా అవిశ్వాసంతో అయినా మోడీలో చలనం, మాట్లాడేలా చేయవచ్చు. అదే అతిపెద్ద విజయం అవుతుందని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.

అవిశ్వాసానికి అనుమతించిన స్పీకర్:

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం ప్రధాని మోడీ గైర్జాహజరుపై విపక్ష సభ్యులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొనగా.. లోక్‌ సభ మధ్యాహ్నాం 2గం. వరకు వాయిదా పడింది.

చివరి ప్రయత్నంగా "అవిశ్వాసం”… లక్ష్యం ఇదే?:

కాగా, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మణిపుర్‌ అంశాన్నే ప్రధానంగా లేవనెత్తుతొన్న విపక్ష పార్టీలు.. దీనిపై సుదీర్ఘ చర్చకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై హోంశాఖ మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం చెబుతుండగా.. ఇందుకు విపక్షాలు ససేమిరా అంటున్నాయి. ప్రధాని మోడీ దీనిపై మాట్లాడాలని డిమాండు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.

లోక్‌ సభలో మొత్తం సభ్యులు 543 మంది ఉండగా... ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 272. అయితే అధికార ఎన్డీఏకి 300లకుపైగా సభ్యుల మద్దతు ఉంది. దీంతో విపక్ష పార్టీలు అవిశ్వాసం ప్రవేశపెట్టినా అది వీగిపోతుందనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ "ఇండియా" కూటమి ఇందుకు పావులు కదుపుతోంది. కారణం... అవిశ్వాసాన్ని స్పీకర్‌ అనుమతిస్తే సభలో చర్చ, ఓటింగ్‌ జరుగుతుంది.

దీంతో అనేక అంశాలపై ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం దక్కుతుందని వారి ఆలోచన. పైగా మణిపూర్ ఘటన విషయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో... ఈ చర్చకు మరింత విలువ ఉంటుందని.. ప్రజలను ఆలోచింపచేసేలా విమర్శలు గుప్పించొచ్చని ఆలోచిస్తుందని అంటున్నారు.

అందుకే మణిపూర్ ఘటనపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విషయంలో... చివరి ప్రయత్నంగా "అవిశ్వాస తీర్మానాన్ని" ప్రయోగించేందుకు "ఇండియా" కూటమి సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాగా... చివరిసారిగా 2018లో మోడీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఎన్డీఏకు 325 ఓట్లు, విపక్షాల తీర్మానానికి 126 సభ్యుల మద్దతు లభించింది.