Begin typing your search above and press return to search.

'ఇండియా' అంటే మోడీ భయపడుతున్నారా ?

అవిశ్వాస తీర్మానం ద్వారా ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసేయటం సాధ్యం కాదు

By:  Tupaki Desk   |   28 July 2023 7:25 AM GMT
ఇండియా అంటే మోడీ భయపడుతున్నారా ?
X

కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల 'ఇండియా కూటమి' అంటే నరేంద్రమోడీ భయపడుతున్నట్లే ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇన్ని ప్రతిపక్షాలు ఏకమవుతాయని బహుశా మోడీ ఊహించి ఉండరు. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా యూపీఏ ఉన్నదంతే. అయితే యూపీఏకి ఎన్డీయేని ఎదుర్కొనేంత బలం లేదన్నది వాస్తవం. అందుకనే మరిన్ని ప్రతిపక్షాలను కలుపుకోవాలని, వీలైనన్ని ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తేకానీ బీజేపీ ఎదుర్కోవటం సాధ్యం కాదని యూపీఏతో పాటు మరికొన్ని ప్రతిపక్షాల నేతలు ఆలోచించారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒకటికి పదిసార్లు ప్రయత్నించిన తర్వాత ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. రెండుసార్లు సమావేశమైన తర్వాత ఇండియా కూటమి ఏర్పాటైంది. రేపటి ఎన్నికల్లో సీట్ల షేరింగ్ ఎలా జరుగుతుందో కానీ ఇప్పటికైతే సుమారు 25 పార్టీలో ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిలో భాగస్తులయ్యాయి. వీటి మొదటి పోరాటం మణిపూర్లో అల్లర్లపై మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించటమే.

అవిశ్వాస తీర్మానం ద్వారా ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసేయటం సాధ్యం కాదు. కాకపోతే అవిశ్వాస తీర్మానంలో జరిగే చర్చల్లో మణిపూర్లో పరిస్ధితులను, అల్లర్ల వాస్తవాలను, మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడమే అసలు ఉద్దేశ్యం. ఈ విషయం అర్ధమవ్వటంతోనే మోడీలో టెన్షన్ మొదలైనట్లుంది. తాజాగా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతు పదేపదే ఇండియా కూటమిపైనే విరుచుకుపడ్డారు. ఇండియా పేరుపెట్టుకుని దేశాన్ని లూటీచేద్దామని కొత్త కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టిందని మోడీ అనటమే విచిత్రంగా ఉంది.

ఇండియా కూటమి ఏర్పాటుతోనే ప్రతిపక్షాలు దేశాన్ని దోచేసుకోవటం సాధ్యమేనా ? కూటమిలోని నేతలంతా అవినీతి చరిత్ర ఉన్న వాళ్ళే అని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇండియా కూటమిపై తానుచేస్తున్న ఆరోపణలు, విమర్శలనే పార్లమెంటు వేదికగా చేయమంటే చేయటంలేదు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు పార్లమెంటులో సమాధానం చెప్పాల్సిన మోడీ బయటెక్కడో బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లో మాట్లాడుతున్నారు. దీంతోనే ఇండియా కూటమంటే మోడీలో భయం మొదలైందని అర్ధమవుతోంది. ఇపుడే మోడీ ఇంతగా భయపడుతుంటే రేపు ఎన్నికల్లో వాన్ ఆన్ వన్ అనే ఫార్ములా ప్రకారం ఇండియా కూటమి పక్కాగా ఎన్నికల్లో పోరాటంచేస్తే మోడీ అప్పుడింకా ఇబ్బందిపడతారేమో.