మోడీ ప్రభుత్వం గమ్మత్తుగా ఉందా ?
నరేంద్ర మోడీ ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా ఉంది
By: Tupaki Desk | 29 July 2023 5:21 AM GMTనరేంద్ర మోడీ ప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. దేశంలోని సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కనిపెట్టేందుకే పార్లమెంటు ఉన్నది. అలాంటి పార్లమెంటులోనే సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటే ఎన్డీయే అంగీకరించటంలేదు. మణిపూర్ అల్లర్లపైన చర్చించాలని ప్రతిపక్షాల ఇండియా కూటమి ఎంత ప్రయత్నిస్తున్నా నరేంద్రమోడీ ప్రభుత్వం అవకాశం ఇవ్వటం లేదు. వందలమంది చనిపోయి, మరికొన్ని వేలమంది గాయపడి, నిరాశ్రయులై ఎక్కడెక్కడో శిబిరాల్లో తలదాచుకుంటున్న జనాల సమస్యలను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదంటేనే ఆశ్చర్యంగా ఉంది.
గడచిన రెండున్నర నెలలుగా అల్లర్లు, దాడులు, గృహదహనాలు, కాల్పులతో మణిపూర్ మండిపోతోంది, దద్దరిల్లిపోతోంది. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, అరాచకాలపై నరేంద్రమోడీ ఇంతవరకు ఒక్క మాటకూడా మాట్లాడలేదు. సమస్య ఎక్కడ మొదలైంది ? ఎలా పెరిగిపోయింది ? దానికి కారణాలు ఏమిటి ? కారకులు ఎవరు ? అనే విషయాలను చర్చించాలని ఇండియా కూటమి+ప్రతిపక్షాలు పదేపదే డిమాండ్ చేస్తున్నా స్పీకర్ ఓంబిర్లా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.
అందుకనే వేరే దారిలేక చివరకు ఇండియా కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానికి నోటీసిచ్చింది. నిబంధనల ప్రకారమే నోటీసు ఉండటంతో చేసేదిలేక దాన్ని ఆమోదించి చర్చకు తేదీని నిర్ణయించి ప్రకటిస్తానని స్పీకర్ చెప్పారు. అంటే ఒక రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై పార్లమెంటులో చర్చించాలంటే కేంద్రప్రభుత్వం మీద అవిశ్వాసతీర్మానం పెట్టడం మినహా మరో దారిలేదా ? క్వశ్చన్ అవర్, ఇతర ప్రోటోకాల్ ను పక్కనపెట్టి చర్చకు ఓకే చెప్పటానికి మణిపూర్ అంశం కేంద్రానికి అంత ప్రాధాన్యమున్న అంశంగా కనబడలేదా ?
ఒక రాష్ట్రం తగలబడిపోవటానికి మించిన అత్యవసరమైన సబ్జెక్టు ఏముంటుంది పార్లమెంటులో చర్చించేందుకు ? ఈ విషయం తెలీకే నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్చకు అనుమతించటంలేదా ? కాదు..ఎంతమాత్రం కాదు. చర్చలకు అనుమతిస్తే మణిపూర్లో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల వైఫల్యాలు బయడపడతాయి. దాన్ని దేశమంతా చూస్తుంది, వింటుంది. ప్రభుత్వాలను ప్రతిపక్షాలు ఎండగడతాయి. ప్రతిపక్షాల దాటిని మోడీ తట్టుకోలేరు. ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పేంత సీన్ లేదు. అందుకని అసలు చర్చకే అనుమతించకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తోంది. ఇదే మోడీ తరచు చెప్పే ప్రజాస్వామ్య విలువలు.