మోడీ రాజకీయ కాలుష్యాన్ని పెంచేశారా ?
ఎలాంటి ఉపయోగంలేకపోయినా అనవసరంగా తెలంగాణా రాజకీయ వాతావరణాన్ని నరేంద్రమోడీ కంపుచేసి పోయారు
By: Tupaki Desk | 5 Oct 2023 5:13 AM GMTఎలాంటి ఉపయోగంలేకపోయినా అనవసరంగా తెలంగాణా రాజకీయ వాతావరణాన్ని నరేంద్రమోడీ కంపుచేసి పోయారు. నిజామాబాద్ పర్యటన సందర్భంగా మోడీ అనేక ఏకపక్ష ఆరోపణలు చేసి వెళ్ళారు. అప్పుడెప్పుడో తనకు కేసీయార్ కు మధ్య జరిగిన భేటీ వివరాలను ఉద్దేశ్యపూర్వకంగానే మోడీ ప్రస్తావించారు. నిజానికి ఎప్పటి విషయాలనో ఇపుడు చెప్పటం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మోడీ-కేసీయార్ మధ్య జరిగిన మాటలను ఇపుడు బయటకు చెప్పటం వల్ల ఎవరికి ? ఏమిటి ఉపయోగం ?
పోనీ కేసీయార్ ఎన్డీయేలో చేరుతానని ప్రాధేయపడితే తాను వద్దు పొమ్మనానని చెప్పటానికి ఎవరైనా సాక్ష్యులున్నారా అంటే లేరు. కేసీయార్ ప్రాధేయపడితే తాను వద్దన్నట్లు మోడీ చెప్పారంతే. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు మధ్యలో ఇంకెవరైనా సాక్ష్యముంటే జనాలు దాన్ని నమ్ముతారు. అంతేకానీ కేసీయార్ పై బురదచల్లేసే మాటలు మోడీ చెబితే ఎవరు నమ్ముతారు ? మోడీ వెళ్ళిపోగానే ఏమైంది వెంటనే కేటీయార్, మంత్రులు ఎదురుదాడికి దిగారు.
రాజకీయ కాలుష్యం ఏ స్ధాయిలో పెరిగిపోయిందంటే మోడీ మాటలకు మద్దతుగా బీజేపీ నేతలు, వ్యతిరేకంగా మంత్రులు, వామపక్ష నేతలు ఏదేదో మాట్లాడేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ కో ఇటు మోడీతో పాటు అటు కేసీయార్ ను కూడా దుమ్ముదులిపేస్తున్నారు. తెలంగాణాలో పర్యటించటం ద్వారా మోడీ చేసిందేమిటంటే రాజకీయ కాలుష్యాన్ని బాగా పెంచేసి వెళ్ళారు.
అసలే రాజకీయంగా పార్టీల మధ్య పెద్ద గొడవలు అవుతున్నాయి. ప్రతి చిన్న అంశం కూడా పెద్ద వివాదంగా మారిపోతోంది. ఇలాంటి నేపధ్యంలో తెలంగాణాలో పర్యటించిన మోడీ నిర్మాణాత్మకంగా ఏమిచెప్పినా బాగానే ఉంటుంది. కేసీయార్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయదలచుకుంటే ఏమైనా చేయచ్చు కానీ వాటికి ఆధారాలుండాలి. ఆధారాలు లేకుండా ఏమి మాట్లాడినా ఏకపక్ష ఆరోపణలే అవుతాయి, వాటిని నమ్మే జనాలు కూడా పెద్దగా ఉండరు. కాకపోతే ఏమవుతుందంటే నాలుగురోజులు రాజకీయ వాతావరణమంతా కంపు కంపైపోతుంది. ఇపుడు మోడీ పర్యటన వల్ల జరిగిందిదే. ఇలాంటి కంపును జనాలు ముందు ముందు ఇంకెంత భరించాల్సుంటుందో.