రాహుల్ స్టార్టప్ కంపెనీ.. అది ఎప్పటికీ ప్రారంభం కాదు: మోడీ సటైర్లు
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్రంగా సటైర్లు వేశారు
By: Tupaki Desk | 7 Feb 2024 11:30 PM GMTప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్రంగా సటైర్లు వేశారు. ``దేశంలో మేం స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. వారికి అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అందుకే దేశంలో ఇప్పటికి 2 లక్షలకుపైగా స్టార్టప్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. తద్వారా మరిన్ని లక్షల మందికి ఉపాధి లభించింది. మాటలో మాట.. మాకు పోటీగా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్టప్ ప్రారంభించింది. అదే..రాహుల్ బాబా స్టార్టప్. ఈ స్టార్టప్ కంపెనీ.. ఉపాధి ఇవ్వదు. అందరితోనూ పాదయాత్ర చేయిస్తుంది. అయిపోయిన తర్వాత.. వారిని వారి మానాన వదిలేస్తుంది. ఆ స్టార్టప్ కంపెనీ పాదయాత్ర చేస్తూనే ఉంటుంది.. ఎప్పటికీ.. స్టార్ట్ కాదు. రిబ్బన్ కట్ చేస్తారని ఎదురు చూస్తున్నవారు.. రన్నింగ్‌లో ఉన్న మరో కంపెనీలోకి వెళ్లిపోతున్నారు(బీజేపీలోకి జంప్ చేస్తున్నారు)`` అని వ్యాఖ్యానించారు.
ప్రైవేటీకరణపై..
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వరుసగా రెండో రోజు కూడా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాన మంత్రి.. ప్రైవేటీకరణను ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తమను ప్రైవేటీకరణకు అనుకూలమని ప్రచారం చేస్తున్నారని..కానీ, ఎవరు అనుకూలమో ఇప్పుడు చెబుతా! అంటూ.. ఆయన గణాంకాల సయితంగా వివరణ ఇచ్చారు. దేశంలో ఒకప్పుడు బలంగా ఉన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ ఎన్ ఎల్)ను ప్రైవేటీకరించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా హిందుస్తాన్ ఏరోనాటికల్(హెచ్ ఏ ఎల్) కంపెనీని ప్రవేటీకరించింది ఎవరో అందరికీ తెలిసిందేనన్నారు.
ఇక, ఎయిర్ ఇండియా సంస్థలను కాంగ్రెస్ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ప్రధాని ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో బీఎస్ ఎన్ ఎల్‌కు 5జీ కూడా తీసుకొచ్చి తాము బలోపేతం చేశామన్నారు. హెచ్ ఏ ఎల్ కూడా లాభాల్లో నడుస్తోందన్నారు. కీలకమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై మాట్లాడుతూ.. తమ హయాంలో ఇది మూతపడుతుందని కాంగ్రెస్ పుకార్లు పుట్టించిందని తీవ్రస్తాయిలో ప్రధాని విరుచుకుపడ్డారు. కానీ, ఇప్పుడు ఎల్ ఐసీ షేర్ ధర రికార్డ్ స్థాయిలో ఉందని లెక్కలతో సహా వివరించారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు రూ.9 లక్షల కోట్ల నుంచి.. రూ.75 లక్షల కోట్లకు పెంచామని ఇది తమ ఘనతని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు అన్నీ తెలుసునని.. వచ్చే ఎన్నికల్లోనూ తమకే పట్టం కట్టనున్నారనివ్యాఖ్యానించారు.