Begin typing your search above and press return to search.

70ప్లస్ మోడీని తట్టుకోలేకపోతున్న అధినేతలు

ఇప్పుడు ప్రస్తావించిన వారిలో బలంగా.. అత్యంత శక్తి సామర్థ్యాలతో.. తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్నది ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే

By:  Tupaki Desk   |   11 Feb 2024 10:30 AM GMT
70ప్లస్ మోడీని తట్టుకోలేకపోతున్న అధినేతలు
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేరళ సీఎం (విజయన్).. తమిళనాడు ముఖ్యమంత్రి (స్టాలిన్).. ఒడిశా సీఎం (నవీన్ పట్నాయక్).. కర్ణాటక ముఖ్యమంత్రి (సిద్దరామయ్య)తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉంటారు. వీరందరిలో కామన్ పాయింట్ వీరంతా 70ప్లస్ వయసులో ఉన్న వారు. ఇదంతా చూస్తే దేశాన్ని నడిపిస్తున్న నాయకత్వాల్లో కీలక భూమిక పోషిస్తున్న వారంతా సెవన్టీ ప్లస్ వారే అన్న విషయం అర్థమవుతుంది. ఇక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతలు సైతం డెబ్బైయ్యో పడికి దగ్గరకు వస్తున్న వారు.

ఇప్పుడు ప్రస్తావించిన వారిలో బలంగా.. అత్యంత శక్తి సామర్థ్యాలతో.. తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్నది ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే. మిగిలిన వారు వారికి ఉన్న పరిధిలో మాత్రమే వ్యవహరిస్తున్నారు. కానీ.. మోడీ అలా కాదు. ఆయన యువకుడిలా దూసుకెళుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఎదురొడ్డే నాయకుడే లేడని చెప్పటం అతిశయోక్తి లేదనే చెప్పాలి. యావత్ దేశం మొత్తంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ఆయనకున్న జనాదరణలో ఆయన సమీపానికి అక్కర్లేదు.. కనీసం పాతిక శాతం తక్కువగా కూడా ఎవరు లేని సిత్రమైన పరిస్థితి నేడు భారత్ లో ఉందని చెప్పాలి.

సాధారణంగా సెవన్టీ ప్లస్ వచ్చిన తర్వాత వయోభారం అన్న పదాన్ని వాడటం కామన్. కానీ.. మోడీ విషయంలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. వయసు విషయంలో మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీ చాలా చిన్న వయస్కుడే. కానీ.. ఆయనకు ధీటుగా ఎదగలేకపోవటం ఆయన్ను ఇబ్బందికి గురి చేస్తోంది. ఇప్పటికి దేశ రాజకీయాల్ని.. దేశ ప్రజల మనోభావాల్ని.. వారి ఆశల్ని.. ఆశయాల్ని గుర్తించే విషయంలో రాహుల్ వెనుకబడే ఉన్నారని చెప్పాలి. దీంతో.. మిగిలిన వారికి భిన్నంగా మోడీ దూసుకెళుతున్నారు.

ఆయన తోటి వయసున్న వారు మాత్రమే కాదు.. ఆయనకంటే ఇరవైఏళ్లు చిన్నోళ్లు సైతం ఆయన్ను.. ఆయన వేగాన్ని అందిపుచ్చుకోలేని విచిత్ర పరిస్థితి భారత రాజకీయాల్లో నెలకొంది. ఎవరైనా ఒకరిద్దరు తల ఎగరేస్తే.. వారికి చుక్కలు చూపించటమే కాదు.. ఆయన్ను ఎదుర్కొనే తలనొప్పి వ్యవహారం ఎందుకు? సర్దుకుపోతే సరిపోలా? అన్నట్లుగా మారింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని వారి ఉనికి క్రమక్రమంగా తగ్గిపోతున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. విచిత్రమైన విషయం ఏమంటే.. ఆయన్ను ఢీకొనాలనుకునే తెలుగుదేశం.. బీఆర్ఎస్ అధినేతల పరిస్థితి ఏమైందో తెలిసిందే. ఇక.. శరద్ పవార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మోడీ కంటే వయసులో చిన్న అయిన ఉద్దవ్ ఠాక్రే లాంటోళ్లకు చుక్కలు కనిపించటమే కాదు.. చేతిలో ఉన్న అధికారం చేజారిన పరిస్థితి. ఎదురుదెబ్బల్ని ఎదుర్కొంటూ అంతో ఇంతో తట్టుకొని నిలబడిన అధినేత ఎవరైనా ఉన్నారంటే అది ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రమేనని చెప్పాలి. 2019లో మోడీతో పెట్టుకున్న చంద్రబాబు పరిస్థితి ఏమైందో తెలిసిందే. రెండు నెలల్లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీ ముందుకు కూడా వెళ్లలేక.. ఆయన నీడలాంటి అమిత్ షా వద్దకు వెళ్లి ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. మీరేం చెబితే దానికి ఓకే.. ఎన్నికల్లో గెలుపు వరాన్ని ఇవ్వాలని కోరిన వైనాన్ని చూసినప్పుడు మోడీనా మజాకానా అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి. కాదంటారా?