మోడీ వస్తున్నారు.. 'కూటమి' కోసమా..? బీజేపీ కోసమా?
మోడీ రాక షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఆయన ఈ నెల 7న నేరుగా రాజమండ్రి వస్తున్నారు. అది కూడా.. సాయంత్రం 4 గంటలకు వస్తారు.
By: Tupaki Desk | 2 May 2024 9:30 AM GMTఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు.. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఆయన షెడ్యూల్‌పై డేట్లు కూడా ఖరారయ్యాయి. వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే ఆయన వస్తున్నట్టు బీజేపీ నేతలు.. కూటమి అధినేత చంద్రబాబు కూడా ప్రకటించారు. కానీ, ఎందుకో.. షెడ్యూల్ మారింది. ఏడున దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ ఉందని చెబుతున్నారు. ఇది కూడా కారణమే కావొచ్చు. ఏదేమైనా.. ప్రధాని మోడీ రాక అయితే ఖాయమైంది.
మోడీ రాక షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఆయన ఈ నెల 7న నేరుగా రాజమండ్రి వస్తున్నారు. అది కూడా.. సాయంత్రం 4 గంటలకు వస్తారు. ఆ తర్వాత.. ఆయన బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి పక్షాన ప్రచారం చేయనున్నారు.
అనంతరం.. అక్కడ నుంచి నేరుగా.. విశాఖకు వెళ్లనున్నారు. ఇక్కడ రెండు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి విశాఖ, రెండు అనకాపల్లి. విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు.
మరి ప్రధాని రెండు చోట్ల ప్రచారం చేయనున్నారా? అంటే.. షెడ్యూల్ ప్రకారం.. ఆయన అనకాపల్లికే పరిమితమయ్యారు. ఇక్కడ సీఎం రమేష్ తరఫున మోడీ ప్రచారం చేస్తారు. కట్ చేస్తే.. 8వ తేదీ షెడ్యూల్ లోనూ బీజేపీ నేతలకే ప్రచారానికి ఆయన పరిమితమయ్యారు. అనకాపల్లి నేరుగా ఆయన రాజంపేట ఎంపీ అభ్యర్థి, బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. అనంతరం విజయవాడ వచ్చి.. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తరఫున ప్రచారం చేస్తారట.
కట్ చేస్తే..
ప్రధాని వస్తున్నారు.. సరే.. కానీ.. ఇక్కడ కూటమి పక్షాన ఆయన ప్రచారం చేయకుండా.. కేవలం బీజేపీ అభ్యర్థుల ప్రచారానికే పరిమితం కావడంతో రాజకీయంగా ఇది చర్చనీయాంశంగా మారింది. నిజానికి మోడీ వస్తే.. కూటమికి బలం పెరగాలి. కానీ.. సందేహాలు పెరిగేలా చేస్తున్నారు. మరోవైపు.. మోడీ రాక నేపథ్యంలో మరో బిగ్ డౌట్ కూడా వస్తోంది. కూటమి ఇచ్చిన మేనిఫెస్టోపై ఆయన రియాక్ట్ అవుతారనేది ప్రశ్న. ఇప్పటి వరకు దీనిని బీజేపీ ఓన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ప్రధాని స్పందిస్తారా? లేక.. చేతులు దులుపుకొంటారా? అనేది చూడాలి.