రాజ్యాంగాన్ని మార్చటం పాపమైతే.. కాంగ్రెస్ సర్కారు ఎన్నిసార్లు చేసింది?
మోడీ ఆశిస్తున్నట్లుగా తాజా ఎన్నికల్లో 400 ఎంపీలను గెలిపించుకుంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారని.. దాన్ని సవరిస్తారంటూ ఉదరగొట్టేస్తున్నారు
By: Tupaki Desk | 7 April 2024 5:00 AM GMTసార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో భారీ ఎత్తున సాగుతున్న ప్రచారాల్లో ముఖ్యమైనది.. విపక్ష పార్టీలు.. మేధావులమంటూ ట్యాగ్ వేసుకొని తమదైన తీర్పుల్ని ఇచ్చేసేటోళ్లు ఒక అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇక.. వాట్సాప్ యూనివర్సిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ ఆశిస్తున్నట్లుగా తాజా ఎన్నికల్లో 400 ఎంపీలను గెలిపించుకుంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారని.. దాన్ని సవరిస్తారంటూ ఉదరగొట్టేస్తున్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ఇప్పటివరకు ఎలాంటి సవరణ జరగలేదన్నట్లుగా.. ఎలాంటి మార్పులు చేయలేదన్నట్లుగా వారి ప్రచారం సాగుతోంది. మరి వాస్తవం ఏమిటన్నది చూస్తే.. 2018 నాటికి భారత రాజ్యాంగంలో 123 సార్లు సవరణ ప్రతిపాదనలు జరగ్గా.. 101 సార్లు చట్టాల్ని సవరణ చేశారు. మరి.. ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసినప్పుడు లేని లొల్లి తాజాగా మోడీ అండ్ కో 400 సీట్లను సొంతం చేసుకుంటే వచ్చే ఇబ్బంది ఏమిటి? అన్నది ప్రశ్న.
రాజ్యాంగానికి ఇప్పటివరకు జరిగిన 101 సవరణల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సవరణలు అక్షరాల 62 సార్లు. దేశ తొలి ప్రధానమంత్రిగా పని చేసిన జవహర్ లాల్ నెహ్రూ హయాంలో 17సార్లు రాజ్యాంగానికి సవరణలు చేస్తే..ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ఏకంగా 28 సార్లు సవరణ చేశారు. ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న వేళలో 10సార్లు రాజ్యాంగ సవరణ చేయగా.. ఆయన సతీమణి సోనియా సారథ్యంలోని యూపీఏ సర్కారు తన పదేళ్ల ప్రభుత్వంలో ఏడు సార్లు రాజ్యాంగానికి సవరణ చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరణలు చేసినప్పుడు.. మోడీ సర్కారు రాజ్యాంగాన్ని మార్పులు చేస్తే వచ్చే నష్టమేంటి. అది కూడా.. భారీ మెజార్టీ సాధించిన తర్వాత.. ప్రజల నుంచి తీర్పు వచ్చిన తర్వాత చేపడితే తప్పేముంది? రాజ్యాంగాన్ని మార్పులు చేస్తారంటూ ఆగమాగం చేసే వారంతా.. మోడీ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో దశాబ్దాల తరబడి దేశాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో కీలక వివాదాలను ఒక కొలిక్కి తీసుకురావటమే కాదు.. వాటికి పుల్ స్టాప్ పెట్టిన వైనాన్ని మర్చిపోకూడదు.
ఏళ్లు ఏళ్లుగా సమస్యల్ని.. వివాదాల్ని సజీవంగా ఉంచేస్తూ.. ఎప్పటికి పరిష్కారాన్ని చూపని కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా? అన్నది ప్రశ్న. మోడీ అండ్ కోకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ఉదరగొడుతున్న విపక్షాల వల్ల ఒక మేలు ఉంటుందన్నది మర్చిపోకూడదు. అదేమంటే.. ఇంత ప్రచారం చేసిన తర్వాత కూడా దేశ ప్రజలు 400 సీట్లను ఇస్తే మాత్రం.. రాజ్యాంగానికి మోడీ ప్రభుత్వం చేసే మార్పుల విషయంలో ఇప్పుడు నోరు పారేసుకనే పార్టీలు.. నేతలు ఎవరూ నోరు విప్పకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరేం జరుగుతుందో చూడాలి.