మోడీ వ్యూహం : రచ్చ గెలిచి ఇంట గెలవాలి ?
ప్రధాని నరేంద్ర మోడీకి బయట దేశాలలో పర్యటనలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తాయి
By: Tupaki Desk | 12 July 2024 3:50 AM GMTప్రధాని నరేంద్ర మోడీకి బయట దేశాలలో పర్యటనలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తాయి. ఆయనకు దేశీయంగా సమస్యలు వస్తే వెంటనే విదేశాలకు పయనం అవుతారు అని ప్రతిపక్షాలు తరచూ విమర్సలు చేస్తూ ఉంటాయి. అయితే అది మోడీ వ్యూహంలో భాగమే అని అంటున్నారు.
మోడీకి ఇపుడు ఇంట సమస్యలు ఏంటి అంటే చాలానే ఉన్నాయని చెప్పక తప్పదు. అవేంటి అంటే బీజేపీకి ఈసారి ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాలేదు. కేవలం 240 నంబర్ దగ్గరే బీజేపీ ఆగిపోయింది. దాంతో మిత్రుల మీద అధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది మోడీ రాజకీయ జీవితం మొత్తంలో అతి పెద్ద సవాల్. ఎన్నడూ చూడని వింత అనుభవం కూడా అని అంటున్నారు.
అలా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం చేసినా మునుపటి జోష్ హుషార్ అయితే లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే 230 మంది ఎంపీలతో అతి పెద్ద బలమైన విపక్షంగా ఇండియా కూటమి ఉంది. పప్పు అనుకున్న రాహుల్ గాంధీ నిప్పు కణికగా మారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదురు నిలిచారు. ఆయన పార్లమెంట్ లో తనదైన శైలిలో చేస్తున్న ప్రసంగాలు అధికార పక్షానికి ఇరకాటంగా మారుతున్నాయి.
ఇక ఎన్డీయే మిత్రపక్షాలతో తలనొప్పులు పొంచి ఉండనే ఉన్నాయి. ఇలా తొలి నెల రోజులు గడవక ముందే మోడీ రెండు కీలక దేశాలలో పర్యటన పెట్టుకున్నారు. అందులో మొదటిది రష్యా. రష్యాకు మోడీ ఎందుకు వెళ్లారు అంటే ఇక్కడే చాలా ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలెట్టింది. అది నేటికీ కొనసాగుతోంది. ఉక్రెయిన్ వెనక అమెరికా ఉంది. రష్యాను అమెరికా నిలువరించాలని అనుకుంటోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని స్పష్టంగా ఇక్కడ చాటుకుంది.
రష్యాతో పూర్వం నుంచి ఉన్న సంబంధాలను కాపాడుకుంది. అదే సమయంలో పెద్దన్న అమెరికాను సైతం కాస్తా పక్కన పెట్టింది. ఉక్రెయిన్ యుద్ధం తరువాత రష్యాకు ప్రధాని మోడీ వెళ్ళడం ఇది తొలిసారి. దాంతో ప్రపంచ దేశాలు అన్నీ ఆసక్తిగా చూశాయి. అమెరికా అయితే ఉక్రెయిన్ తో రష్యా యుద్ధాని ఆపించగల శక్తి భారత్ కి ఉందని పేర్కొంది. ఈ రకమైన స్పందనతో భారత్ వెయిట్ ప్రపంచంలో బాగా పెరిగింది.
ఇక రష్యాకు భారత్ ఈ సమయంలో మరింత దగ్గర కావడంతో రష్యా సైతం ఎంతో పొంగిపోయింది. మోడీని ప్రియ మిత్రుడిగా సమాదరించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. మూడవసారి గెలిచినందుకు శుభాకాంక్షలు చెప్పింది.
మోడీ రష్యాకు వెళ్ళడం వెనక ప్రపంచంలో భారత్ పాత్ర తెలియ చెప్పడం తో పాటు పాకిస్థాన్ చైనాలకు చెక్ చెప్పడం కూడా మరో ఉద్దేశ్యం అని అంటున్నారు. కీలకమైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవడం శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకోవడం ద్వారా భారత్ ని శత్రు దేశాల నుంచి పరిరక్షించడం అన్న వ్యూహం ఉంది. ఈ విధంగా దేశీయంగా చూస్తే భారత్ సరిహద్దు ముప్పు నుంచి పూర్తి స్థాయి భద్రతను పొందేందుకు ఈ పర్యటన అని అంటున్నారు.
అలా భారతీయులలో మోడీ ప్రభుత్వం ఉంటేనే దేశంలో రక్షణ అన్న భావనను కలిగించడం కూడా ఈ పర్యటన ఉద్దేశ్యం. అలాగే ఆస్ట్రియా దేశం పర్యటనలోనూ కీలక చర్చలు జరిగాయి. మోడీ విదేశీ పర్యటన ఆయన ఖ్యాతిని మరింతగా పెంచినట్లు అయింది. అంటే మోడీ లాంటి బలమైన నేత ఉన్నారు అని ప్రపంచం గుర్తించేలా ఈ పర్యటన ఉంది.
అది కాస్తా దేశీయంగానూ ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. సొంత మెజారిటీ లేదని బలహీనమైన ప్రధానిగా మోడీని భావించనక్కరలేదని ఆయన ఎంతటి బలవంతుడో ఇతర దేశాలు చాటు చెబుతున్నాయన్నది కూడా బీజేపీ వాదనగా ఉంది. ఇక ఎన్డీయే లోపలా బయటా కూడా మోడీ కొంతకాలం పాటు ఒత్తిళ్ళ నుంచి అధిగమించడానికి అలాగే అంతర్జాతీయంగా భారత్ ని శక్తివంతమైన దేశంగా నిలిపిన నేతగా మోడీ ఉన్నారని చెప్పడానికి ఈ పర్యటనలు దోహదపడ్డాయని అంటున్నారు. సో ఇంట గెలిచి రచ్చ గెలవడం అన్నది ఒక పాత ముతక సామెత. దానికి మారిస్తే రచ్చ గెలిచి ఇంట గెలవడం బీజేపీ నయా వ్యూహం అని అంటున్నారు.