మోడీకి సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయ్యిందా?
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపారనే పేరు తెచ్చుకున్నారు.. నరేంద్ర మోదీ
By: Tupaki Desk | 19 Feb 2024 4:30 PM GMTగుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపారనే పేరు తెచ్చుకున్నారు.. నరేంద్ర మోదీ. అవే పేరు ప్రతిష్టలతో 2014లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అయిపోయారు. అంతేకాకుండా 2014, 2019 ఎన్నికల్లో బీజేపీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చి వేరే పార్టీ అవసరం లేకుండా కేంద్రంలో సొంతంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు.
గత పదేళ్లుగా ప్రధానిగా ఉంటున్న నరేంద్ర మోదీ మరో విజయంపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని అధికారంలోకి తెచ్చి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావాలని ముచ్చట పడుతున్నారు. సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నారని సెటైర్లు పడుతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో భాగంగా మాట్లాడిన మోదీ తనను కీర్తించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ గెలవడం ఖాయమని.. ఈ నేపథ్యంలోనే విదేశాలు ఎన్నికల్లో గెలిచాక తనను ఆ దేశాలకు రావాలని ఆహ్వానిస్తున్నాయని మోదీ చెప్పుకొచ్చారు.
వచ్చే ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎన్నో దేశాలు తనను వారి దేశాలకు రావాలని ఆహ్వానించాయని మోదీ వెల్లడించారు. మరోసారి దేశంలో బీజేపీ సర్కారు రాబోతుందని ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 11 రోజులు తాను ఉపవాసం ఉన్నానన్నారు. ఈ సమయంలో తాను నాసిక్, లేపాక్షి, శ్రీరంగం, రామేశ్వరం, ధనుష్కోటి లాంటి ప్రాంతాలకు సాధారణ భక్తుడిలా వెళ్లానని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో దక్షిణ భారత ప్రజలు కనబరిచిన ఆదరణను మాటల్లో చెప్పలేనన్నారు. రాజకీయ పండితుల కొలమానాలకు అది అందదని తెలిపారు.
ఈ పదేళ్లలో జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేశానని మోదీ గుర్తు చేశారు. అలాగే త్రిపుల్ తలాక్ ను రద్దు చేశామన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మించామన్నారు. కర్తార్ పూర్ నడవా తెరిచామని చెప్పారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు.
ఇలా బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మోదీ తనను పొగుడుకోవడానికి, స్కోత్కర్షలకే పరిమితమయ్యారని అంటున్నారు. దీంతో మోదీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.