మోడీ బలప్రదర్శన దేని కోసం ?
ఆయన ప్రపంచంలోనే అగ్ర శ్రేణి నేతగా ఉన్నారు. ఆ విధంగా బీజేపీ ప్రచారం చేసుకుంటూ వస్తోంది కూడా
By: Tupaki Desk | 15 May 2024 3:15 AM GMTఆయన ప్రపంచంలోనే అగ్ర శ్రేణి నేతగా ఉన్నారు. ఆ విధంగా బీజేపీ ప్రచారం చేసుకుంటూ వస్తోంది కూడా. దేశంలో మోడీకి సరిసాటి నేతలు ఎవరూ లేరని కూడా చెబుతూ వస్తుంది. ఒక్క మోడీ చాలు అని బీజేపీ చాలా గొప్పగా మాట్లాడుతుంది.
అటువంటి మోడీ చుట్టూ మిగిలిన నాయకులు ఉండాలా. అది అవసరమా అన్న చర్చ వస్తోంది. మోడీ వారణాసిలో తన నామినేషన్ పత్రాలను మంగళవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమం చాలా ఆర్భాటంగా సాగింది. ఎన్డీయే మిత్ర పక్షాల నేతలను అందరినీ పిలిచి మరీ ఘనంగా నిర్వహించారు.
మోడీకి మిత్ర పక్షాల నేతలు అంతా అభినందనలు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం కూడా ఒకటి జరిగింది. అసలు ఇదంతా ఇపుడు ఎందుకు అన్నదే అందరిలోనూ కలుగుతున్న సందేహం. ఆరేడు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం నాటికి టీడీపీ అందులో లేదు. జనసేనకే ఆహ్వానం దక్కింది. అలా పవన్ వెళ్ళి వచ్చారు.
మార్చి నెలలో టీడీపీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇపుడు వారణాసిలో జరిగిన ఎన్డీయే మీట్ కి బాబుకు ఇన్విటేషన్ పంపించారు. చంద్రబాబు వెళ్ళి మోడీని అభినందించడమే కాకుండా మూడవసారి దేశానికి ప్రధాని అవుతారు అని కూడా జోస్యం చెప్పారు.
ఎన్డీయే మిత్ర పార్టీలను చూస్తే ఒక్క టీడీపీ తప్ప మిగిలినవి అన్నీ కూడా చిన్న పార్టీలుగానే ఉన్నాయి. చాలా పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అయి పోటీ చేస్తున్నాయి. టీడీపీ తరువాత నితీష్ కుమార్ పార్టీ మరో పెద్ద పార్టీ. ఇక మహారాష్ట్రలో ఉన్న శివసేన ఎన్సీపీ చీలిక పార్టీల బలాలు ఈ ఎన్నికల్లో తేలాల్సి ఉంది.
బీజేపీకి కూడా మిత్రుల బలం తెలుసో ఏమో కానీ బీజేపీకి సొంతంగా 370 సీట్లు ఎన్డీయేకు 400 సీట్లు అని టార్గెట్ పెట్టుకుంది. అంటే మిత్రులకు కేవలం ముప్పయి సీట్లు మాత్రమే వస్తాయని లెక్క వేసుకుందా అన్నది ఇక్కడ చర్చగా ఉంది.
ఇండియా కూటమిలో డబుల్ డిజిట్ నంబర్ ఎంపీలు కలిగిన పార్టీలు బోలెడు ఉన్నాయి. అంతే కాదు రాష్ట్రాలను ఏలే పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఎన్డీయేలో టీడీపీ తప్ప ఆ స్థాయి పార్టీలు పెద్దగా లేవు అనే అంటున్నారు.
అయినా సగానికి పైగా పోలింగ్ జరిగిన తరువాత ఎన్డీయే మిత్రులతో మీట్ ఎందుకు అన్నది కనుక ఆలోచిస్తే మోడీ కోసం ఈ బల ప్రదర్శన జరిగింది అని అంటున్నారు. ఉత్తరాదిన బీజేపీ ప్రతిష్ట బాగా తగ్గిందని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇక విశ్లేషకుల మాట అయితే బీజేపీ ఈసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మోడీకి ఎంతో మంది మిత్రులు ఉన్నారని, దేశంలో అన్ని పార్టీలూ బీజేపీ జెండా కింద మోడీ నాయకత్వంలోనూ పని చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పుకోవడానికే ఈ సమావేశం పెట్టారు అని అంటున్నారు.
లేకపోతే ఇంత హడావుడిగా అందరికీ వారణాసికి పిలవాల్సిన పరిస్థితి లేదని అంటున్నారు. ఇక గత రెండు పర్యాయాలూ బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది. మిత్రులను కూడా పెద్దగా ఖాతరు చేసిన దాఖలాలు లేవు అని విమర్శలు వినిపించాయి. వారికి నామమాత్రం శాఖలతో సహాయ మంత్రి పదవులు కొందరికి మంత్రి పదవులు ఇచ్చినా తగిన అవకాశాలు లేకుండా చేశారు అని ప్రచారం అయితే సాగింది.
ఈసారి బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 273కి సరిపడా మెజారిటీ రాకపోతే మాత్రం మిత్రుల అండదండలు అవసరం.అందుకే ఇప్పటి నుంచి వారిని మంచి చేసుకుంటూ వారితోనే మేమూ అని అన్నట్లుగా చెప్పుకోవడానికి కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు అని అంటున్నారు.
ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోతే రాజకీయంగా జాతీయ స్థాయిలో కీలక పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. అవి ఎటు నుంచి ఎటు మలుపు తిరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ హ్యాట్రిక్ కలలను నెరవేర్చేందుకు ఉత్తరాది సిద్ధంగా ఉందా అన్నదే అసలైన పాయింట్ అంటున్నారు.