Begin typing your search above and press return to search.

బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందా?

భారత దేశ రాజకీయాలలో మధ్యాణ్న మార్తాండుడు గా వెలుగొందిన నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి అపజయం అనేది లేదు

By:  Tupaki Desk   |   13 July 2024 11:29 AM GMT
బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందా?
X

భారత దేశ రాజకీయాలలో మధ్యాణ్న మార్తాండుడు గా వెలుగొందిన నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి అపజయం అనేది లేదు. ఆయన గుజరాత్ సీఎం గా చేసినా దేశానికి ప్రధానిగా చేసినా అప్రతిహత విజయాలే సొంతం చేసుకున్నారు. అలాంటి నరేంద్ర మోడీకి 2024 ఎన్నికల ఫలితాలు చేదుగానే మారాయి. మోడీ నాయకత్వం వహిస్తున్న బీజేపీకి పాస్ మార్కులు కూడా జనాలు ఇవ్వలేదు.

ఏకంగా ఎన్డీయే కూటమి 400 ఎంపీ సీట్లు అని భారీ లక్ష్యంతోనూ బీజేపీకి సొంతంగా 370 సీట్లను గెలవాలన్న పట్టుదలతో దిగిన బీజేపీకి తనకు తానుగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా 273 సీట్లు కూడా రాలేదు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన బీజేపీ పట్టు జారుతోందని అంటున్నారు.

నిన్నటికి నిన్న లోక్ సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఘోర పరాభవం జరిగింది. మొత్తం 80 దాకా ఎంపీ సీట్లు ఉంటే బీజేపీకి దక్కినవి 32 మాత్రమే. అంటే దాదాపుగా మూడవ వంతు అన్న మాట. ఇక మోడీ సర్కార్ మూడవ సారి అధికారంలోకి వచ్చి నెల రోజులు తిరగకుండానే ఉత్తరాదిన జరిగిన అనేక ఉప ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి భారీ షాక్ ఇచ్చేశాయి.

ఈ నెల 11న మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాలు చూస్తే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి కేవలం రెండంటే రెండు సీట్లలో ఆధిక్యం ప్రదర్శించింది. మిగిలిన పది స్థానాలలో ఇండియా కూటమి పార్టీలు మచి ఆధిక్యత ప్రదర్శించాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ కూడా ముందంజలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ అయిదు సీట్లలో ఆధిక్యంలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ నాలుగు సీట్లలో ఆధిక్యతను చాటుకుంది.

ఇక పంజాబ్ లోని జలంధర్ అసెంబ్లీ సీటులో ఏకంగా 37 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి గెలిచారు. తమిళనాడులో డీఎంకే ముందంజలో ఉంటే హిమాచల్ ప్రదేశ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్య ప్రదేశ్ లో ఒకటి, ఉత్తరాఖండ్ లో రెండు సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉండడం అంటే మోడీ గ్రాఫ్ తగ్గుముఖం పడుతోంది అనే అంటున్నారు

అదే టైంలో దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. మూడవసారి కేంద్రంలో మిత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా నైతికంగా ఆ పార్టీ ఓటమి పాలు అయినట్లే అని ఇండియా కూటమి చేస్తున్న విమర్శలకు బలం చేకూరే విధంగా బీజేపీ రాజకీయ ప్రదర్శన ఉందని అంటున్నారు.

బీజేపీకి ఎపుడూ అండగా నిలిచే ఉత్తరాది రాష్ట్రాలు ఎందుకో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నట్లుగా లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. ఆ వరసలోనే ఉప ఎన్నికలూ ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా బీహార్ లో జేడీయూతో అధికారాన్ని బీజేపీ పంచుకుంటోంది. ఉత్తరాఖండ్ లో కమలం పార్టీ పాలన సాగుతోంది. ఇంకో వైపు చూస్తే హిమాచల్ ప్రదేశ్ లో రెండేళ్ళ క్రితం ఓడింది. ఇపుడు కూడా తేరుకోలేక పోతుంది. గుజరాత్ లోనూ ఈసారి మార్పు చూపిస్తామని ఇటీవలనే రాహుల్ గాంధీ అన్న మాటలను తీసుకుంటే బీజేపీ కూసాలు కదులుతున్నాయా అన్న చర్చ అయితే జరుగుతోంది.

ఏది ఏమైనా బీజేపీకి రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా మారబోతున్నాయని అంటున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర అలగే జార్ఖండ్ వచ్చే ఏడాది జరిగే బీహార్ వంటి రాష్ట్రాలలో బీజేపీ సత్తా చాటకపోతే మాత్రం అది కేంద్ర ప్రభుత్వం మీద కూడా పెను ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ తో పాటు దానిని నడిపిస్తున్న మోడీ గ్రాఫ్ వేగంగానే పడిపోతోందా అన్న చర్చ అయితే దేశవ్యాప్తంగా సాగుతోంది.