ప్రాంతీయ పార్టీలతో స్నేహం అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాట వెల్లడించారు
By: Tupaki Desk | 11 May 2024 8:54 AM GMTఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాట వెల్లడించారు. ఏపీలో పొత్తులపై తనదైన శైలిలో వివరించారు. జాతీయ పార్టీ అయినా బీజేపీకి అహంకారం లేదని చెప్పారు. భవిష్యత్ కోసం ప్రాంతీయ పార్టీలతో చెలిమికి వెనకాడబోమని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలపై ఓ ప్రాంతీయ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏపీలో ఇసుక, మద్యం మాఫియా, తెలంగాణలో భూ మాఫియా రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రభుత్వాలు కూడా వాటి కోసమే పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అవి వారి స్థానిక సమస్యలు అయినందునే వారి విధానాలు కూడా వాటి చుట్టే తిరుగుతున్నాయన్నారు. ఏపీలో వైసీపీ గెలవడం కష్టమేనన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు. పార్లమెంట్ లో అవసరమైన సందర్భాల్లో మద్దతు తెలిపి సహకరించాడన్నారు. కేంద్రం కూడా ఏపీకి ఎంత చేయాలో అంత చేసింది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడంలో తప్పులేదు. అంతేకాని మా మధ్య విభేదాలు మాత్రం లేవు. మా పరిధిలో మేం పనులు చేసుకున్నాం.
టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తుతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఎక్కువ స్థానాలు గెలుస్తామనే ధైర్యం వచ్చింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తుతో పరిపాలన కూడా సులభంగా ఉంటుందనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. గతంలో కూడా టీడీపీతో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన కొత్తగా వచ్చింది అంతే.