'ఇవి మోడీ ఎన్నికలు'.. మేధావులకు పట్టని సామాన్యుడి నాడి
ఈ వాదనను నమ్మిన ప్రముఖుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ఈ కారణంతోనే మోడీ మీద ఆయనెంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో తెలిసిందే.
By: Tupaki Desk | 2 Jun 2024 4:49 AM GMT2019లో ఏం జరిగిందో.. 2024లో అదే జరుగుతుందన్న విషయాన్ని శనివారం సాయంత్రం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఐదేళ్ల క్రితం జరిగిన అంశాల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.. ఈ విషయంపై మరింత క్లారిటీ రాక మానదు. మోడీ మీద దేశ ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందన్న ప్రచారాన్ని కొన్ని వర్గాలు చేపట్టాయి. ఈ వాదనను నమ్మిన ప్రముఖుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ఈ కారణంతోనే మోడీ మీద ఆయనెంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో తెలిసిందే.
మోడీని.. బీజేపీని అస్సలు ఇష్టపడని ఒక బలమైన సెక్షన్ దేశంలో ఉంది. సమాజాన్ని ప్రభావితం చేసే మీడియాలోనూ.. సామాన్య ప్రజలకు భిన్నంగా ఉంటారని చెప్పే మేధావి వర్గంలోనూ మోడీ మీదా.. మోడీ తీరు మీదా.. బీజేపీ వ్యవహారశైలి మీద తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల తీర్పే శాసనం. అలాంటప్పుడు మోడీకి మెజార్టీ ఓటర్లు పట్టం కట్టినా.. దానిపై పెదవి విరిచే ధోరణిని కొందరు ఎంత ఎక్కువగా చేస్తారన్నది తెలిసిందే. సైద్ధాంతిక వైరుధ్యం ఉండొచ్చు. కానీ.. ప్రజాతీర్పును అంగీకరించాలి కదా?
కానీ.. ఇందుకు భిన్నంగా మేధావులు.. వామపక్ష మీడియాతోపాటు.. సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో ఉన్న కొందరు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. నిజానికి.. ఇలాంటి వారి మొండితనం.. మోడీ మీద ప్రదర్శించే వివక్ష.. ప్రజల్లో ఆయన మీద అభిమానాన్ని మరింత పెంచేలా చేస్తుందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఇమేజ్ దారుణంగా దెబ్బ తిందని.. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి 2019తో పోలిస్తే తక్కువ సీట్లు వస్తాయని.. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మోడీకి ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్న భావనను కలిగించేలా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ ఫలితాల్ని చూస్తే.. మోడీకి పట్టం కట్టేందుకు ఓటర్లు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారన్నది అర్థమవుతుంది. ఓటర్ల తీర్పును ఎగ్జిట్ పోల్స్ పట్టేసినప్పుడు.. అదే విషయాన్ని ప్రధాన మీడియా సంస్థలు మొదలుకొని పలు యూట్యూబ్ చానళ్ల వరకు ఎందుకు పట్టలేదు? వీరితో పాటు మేధావులుగా చెలామణి అయ్యే పెద్ద మనషుల కళ్లకు.. మనసులకు ఎందుకు పట్టలేదు? అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. మోడీ మీద ఉన్న ద్వేషం.. కోపం.. వారి కళ్లను.. మనసుల్ని.. మెదళ్లను వాస్తవం వైపు చూడకుండా చేసింది. సామాన్య ఓటరు మనసులో ఏముంది? అన్న విషయాన్ని పట్టించుకోవటానికి ఇష్టపడలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దగా చదువుకోని ఓటర్లు సైతం.. ‘‘ఇవి మోడీ ఎన్నికలు’’ అనే మాట చెప్పిన వైనాన్ని కన్వీనియంట్ గా మర్చిపోవటం.. ఆ మాటల్ని తాము గుర్తించమన్న రీతిలో వ్యవహరించటమే కారణంగా చెప్పాలి.
ఈ కారణంతోనే ఎన్నికలు జరిగే వేళలో.. మీడియాలో వెల్లడైన రిపోర్టులకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి తీరు మోడీకి ఎంత చేటు చేస్తాయన్నది పక్కన పెడితే.. మీడియా విశ్వసనీయత మీద మాత్రం దారుణ ప్రభావాన్ని చూపుతుందని చెప్పాలి. మీడియాలోని అన్ని సంస్థలకు ఒక అంశంపై వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ.. జనం గురించి చెప్పేటప్పుడు.. వారి మాటగా చెప్పే అంశాలన్ని వాస్తవంగా ఉండాలే తప్పించి.. తమ భావజాలాన్ని ప్రజల మాటగా చెప్పే ధోరణి ప్రమాదకరం. అది వారి ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తుందన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.