Begin typing your search above and press return to search.

మోదీ, పుతిన్‌ చర్చల్లో కీలక అంశాలు!

ఈ నేపథ్యంలో మోదీకు రష్యాలో ఘన స్వాగతం లభించింది. ఆయన గౌరవార్థం రష్యా అధినేత పుతిన్‌ ప్రత్యేకంగా రాత్రి విందును ఏర్పాటు చేశారు

By:  Tupaki Desk   |   9 July 2024 9:13 AM GMT
మోదీ, పుతిన్‌ చర్చల్లో కీలక అంశాలు!
X

భారత్‌ కు సుదీర్ఘంగా, అత్యంత సన్నిహిత సంబంధాలున్న దేశం.. రష్యా. భారత్‌ మిత్రదేశాల్లో అత్యంత నమ్మదగిన దేశంగా రష్యా దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ముఖ్యంగా రష్యా అధినేత వాద్లిమిర్‌ పుతిన్‌ అత్యంత ఇష్టమైన దేశం.. భారతే కావడం విశేషం.

ఈ నేపథ్యంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ తన తొలి విదేశీ పర్యటనకు ఇటీవల ఇటలీ వెళ్లగా ఇప్పుడు రెండో పర్యటనకు రష్యాను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందులోనూ ఇటలీకి జీ–7 దేశాల సమావేశాల్లో భాగంగా మాత్రమే వెళ్లారు. కానీ రష్యాకు పూర్తిగా వ్యక్తిగత పర్యటన.

ఈ నేపథ్యంలో మోదీకు రష్యాలో ఘన స్వాగతం లభించింది. ఆయన గౌరవార్థం రష్యా అధినేత పుతిన్‌ ప్రత్యేకంగా రాత్రి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతల మధ్య కీలక అంశాలు చర్చకొచ్చాయి.

రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనూహ్య పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారంతా ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా తరపున సైన్యానికి సహాయమందిస్తున్నారు. అయితే వారికి సరిగా జీతాలు అందడం లేదని, తిరిగి వచ్చేద్దామనుకుంటున్నవారిని రానీయడం లేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మోదీ, పుతిన్‌ చర్చల్లో వారిని వదిలేయడానికి రష్యా అంగీకరించిందని సమాచారం. భారతీయులను క్షేమంగా తిరిగి ఇండియాకు పంపుతామని పుతిన్‌ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధినేతతో కీలక చర్చలు జరపారు. ముఖ్యంగా చైనాతో రష్యా సన్నిహిత సంబంధాలు పెరగడం, కీలక ఆయుధాల అందజేత, ఐరోపాను కలుపుతూ రష్యా మీదుగా చైనా నిర్మిస్తున్న రోడ్‌ అండ్‌ బెల్ట్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్టు తదితరాలపైన మోదీ తన ఆందోళనను పుతిన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

అయితే రష్యాకు ఏ ఇతర దేశంతో ఉన్న సంబంధాలు భారత ప్రయోజనాలకు విఘాతంగా కలిగించివని పుతిన్‌ చెప్పినట్టు సమాచారం. రష్యా హృదయంలో భారత్‌ కు ప్రత్యేక స్థానం ఉందని.. దాన్ని ఇంకో దేశం చెరిపివేయలేదని పుతిన్‌ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తాము ఏ దేశానికి సహాయం చేయబోమని హామీ ఇచ్చినట్టు సమాచారం.

అలాగే రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంపైన కూడా పుతిన్, మోదీ చర్చించారు. చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలనేదే భారత వైఖరి అని మోదీ స్పష్టం చేశారు. ఆయా దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను భారత్‌ ఎప్పుడూ గౌరవిస్తుందని మోదీ తెలిపారు. యుద్ధం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని.. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిసింది.

అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని విస్తరించి అందులో భారత్‌ కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించడానికి మద్దతు ఇవ్వాలని మోదీ కోరారని సమాచారం.

కాగా భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీపై రష్యా అధినేత అభినందనల జల్లు కురిపించారు. ఇది ఏదో యాధృచ్చికంగా వచ్చిన విజయం కాదని.. మోదీ కృషికి, శ్రమకు దక్కిన ఫలితమని కొనియాడారు. మోదీ ఎంతో శక్తిమంతమైన నేతని, భారత ప్రయోజనాలే ముఖ్యంగా కృషి చేయగల నేత అని ప్రశంసలు కురిపించారు.