సుప్రీం అలా అంటే.. ఇలా చేసుడేంది మోడీ సాబ్?
ఈడీ చీఫ్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రా అనే సీనియర్ అధికారి కోసం మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 30 Aug 2023 7:42 AM GMTతనకు నచ్చిన పని చేసేందుకు వెనుకా ముందు చూసుకోకుండా వ్యవహరించే తీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎక్కువే. గత ప్రధానులతో పోలిస్తే.. తాము తీసుకునే నిర్ణయాలపై వేలెత్తి చూపించుకోకూడదన్న జాగ్రత్త నమోకు తక్కువనే మాట వినిపిస్తూ ఉంటుంది. తాను అభిమానించే వారిని.. తాను కోరుకున్న వారి విషయంలో వ్యవస్థల నుంచి విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా షాకింగ్ నిర్ణయాలు తీసుకోవటంలో ఆయన దూకుడు విమర్శలు వెల్లువెత్తేలా ఉంటాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తాను చేయాలనుకున్న పనిని చేసుకుంటూ పోయే ఆయన తీరుకు నిదర్శనంగా తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఒక క్లాసిక్ ఎగ్జాంఫుల్ గా చెప్పక తప్పదు.
ఆ మధ్యన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ఉన్నతాధికారిపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చేసిన వేళ.. సదరు అధికారికి ఒక కొత్త పోస్టు క్రియేట్ చేసి.. ఆయన్ను సూపర్ పవర్ గా మార్చే వైనం చూస్తే.. మోడీనా మజాకానా? అన్న భావన కలుగక మానదు. 'ఆయన ఒక్కరు లేకుంటే వ్యవస్థ నడవదా?' అన్న సూటిప్రశ్నను అడిగించుకున్న తర్వాత కేంద్రంలోని సర్కారు ఏదైనా.. సదరు అధికారిని పక్కన పెట్టేయటం జరుగుతుంది. అలా చేస్తే అది మోడీ సర్కారు ఎందుకు అవుతుంది?
సుప్రీంకోర్టు ఎవరి విషయంలో సీరియస్ అయ్యిందో.. ఆయనకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశగా మారింది. ఇదంతా ఎవరి విషయంలో అంటే.. ఈడీ చీఫ్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రా అనే సీనియర్ అధికారి కోసం మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది. సాధారణంగా ఈడీ.. సీబీఐ చీఫ్ ల పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. కానీ.. మిశ్రాకు ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు ఇచ్చారు. దీంతో.. దాదాపు ఐదేళ్లుగా ఈడీ చీఫ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు.
విపక్షాలు.. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసి వారిని తనిఖీలతో ముచ్చమటలు పోయిస్తున్న మోడీ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు ఉండటం తెలిసిందే. ఈ మొత్తం తనిఖీల పర్వానికి కర్త.. కర్మ.. క్రియగా మిశ్రా వ్యవహరిస్తూ ఉంటారు. తరచూ రాజకీయ అలజడికి ఈడీ తనిఖీలు కారణంగా మారుతున్న వైనం తెలిసిందే. ఈడీని అస్త్రంగా చేసుకొని మోడీ సర్కారు చెలరేగిపోతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. పదవీ విరమణ పొందినప్పటికీ ఏడాది చొప్పున రెండుసార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న వైనం తెలిసిందే.
ముచ్చటగా మూడోసారి ఆయన పొడిగింపు ప్రయత్నాలు చేయగా.. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా మిశ్రా పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్ధమని సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. మిశ్రాను కొనసాగించటం అత్యవసరంగా కేంద్రం వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలో మరే ప్రభుత్వం ఉన్నా.. సుప్రీం వ్యాఖ్యలతో వెనక్కి తగ్గుతుంది. అలా చేస్తే.. అది మోడీ సర్కారు ఎందుకు అవుతుంది.
కేంద్రం వాదనల నేపథ్యంలో మిశ్రాను సెప్టెంబరు 15 వరకు పదవిలో ఉండేందుకు సుప్రీం అనుమతించింది. అంటే.. ఆయన గడువు మరో 17 రోజుల్లో ముగియనుంది. ఇలాంటి వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈడీ.. సీబీఐలకు వేర్వేరుగా చీఫ్ లు ఉంటారు. ఈ రెండింటికి కలిపి మరో సూపర్ పవర్ పోస్టును మోడీ సర్కారు క్రియేట్ చేసింది. అంటే.. సదరు ఉన్నతాధికారి కింద సీబీఐ.. ఈడీ చీఫ్ లు పని చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడా సూపర్ పవర్ పోస్టులో సంజయ్ కుమార్ మిశ్రాకకు కట్టబెట్టిన వైనం చూస్తే.. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇదంతా చూస్తే.. తమకు నచ్చిన అధికారుల్ని కీలక స్థానాలు అప్పజెప్పటం.. కాదంటే.. కొత్త పోస్టుల్ని క్రియేట్ చేయటం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేంద్రంలోనూ ఉండటం చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం.