ఏపీకి మోడీ ఇవ్వబోయేది ఏమిటి ?
ఏపీకి మోడీ ఏమిస్తారు అన్నది అందరిలో చర్చగా ఉంది. ప్రధాని మోడీని ఢిల్లీలో టీడీపీకి చెందిన ఎంపీలు అంతా కలిశారు
By: Tupaki Desk | 27 Jun 2024 2:34 AM GMTఏపీకి మోడీ ఏమిస్తారు అన్నది అందరిలో చర్చగా ఉంది. ప్రధాని మోడీని ఢిల్లీలో టీడీపీకి చెందిన ఎంపీలు అంతా కలిశారు. వారంతా ఏపీకి చేయాల్సిన సాయం గురించి ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ భేటీ అనంతరం ఎంపీలు ట్వీట్ చేయలేదు. అలా చేస్తే అది రొటీన్ అవుతుంది.
ఏకంగా మోడీయే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు నన్ను కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీలు ఏపీలో కేంద్రంలో సన్నిహితంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రగతితో పాటు ఏపీ ప్రగతికి సాధ్యమైనది అంతా చేస్తామని మోడీ ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. దానికి ప్రతిగా చంద్రబాబు అదే ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ తన నాయకత్వంలో వికసిత్ ఏపీని చూస్తామని అన్నారు. ఇలా ఇద్దరు నేతలూ ఎక్స్ వేదికగా బాగానే స్పందించారు.
ఇంతకీ మోడీ ఏపీకి సాధ్యమైనంతగా చేసే సాయం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. మోడీ ఏపీకి ఎంత చేసినా ఏమి చేసినా ప్రజల ఆకాంక్షలను అది అందుకోవాలని అంటున్నారు. ఏపీ ప్రజల గుండెలలో బలంగా నాటుకున్నది ప్రత్యేక హోదా హామీ. దానిని మోడీ తీరిస్తే జనాలు గుండెలలో పెట్టుకుంటారు.
ఏపీని ఎంతోగానో గుర్తించినట్లుగా భావిస్తారు. ఆ పని మోడీయే చేయాలని కూడా వారు ఆశిస్తున్నారు. అలాగే ఏపీకి మంచి రాజధానిని కట్టి ఇచ్చే బాధ్యత కూడా మోడీ తీసుకోవాలని కోరుకుంటున్నారు. పోలవరం సత్వరం పూర్తి చేయలాని కూడా వేడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక ఉండదు కాక ఉండదు అని స్వయంగా మోడీ నోట మాట వినాలని చూస్తున్నారు.
అలాగే ఏపీకి సంబంధించిన విభజన హామీలు అన్నీ నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నారు. ఇలా అయిదు కోట్ల ప్రజలు మోడీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు. అయితే ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఏపీకి ఎంతో చేశమని బీజేపీ నేతలు చెబుతున్న మాటలకే జనాలు విస్తుపోతూంటారు.
ఏపీ జనాలు ఆశించినది చేస్తే వారు మెచ్చుకుంటారు తప్ప మంచి మంచి పదాలతో నోరు తీపిని చేయాలనుకుంటే ఊరుకోరని అంటున్నారు. ఏపీకి నిధులు కావాలి. కానీ అప్పులు కాదు. ఉదారంగా అప్పులు చేసుకోవడానికి అధికారం ఇచ్చినా అది తప్పే అవుతుంది ఏపీకి నిప్పే అవుతుంది అని అంటున్నారు.
వీలైతే మంచి మనసు చేసుకుని స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వాలి. ఏపీ నుంచి కేంద్రానికి ఒక రూపాయి జీఎస్టీ రూపంలో వెళ్తూంటే వెనక్కి వచ్చేది 42 పైసలే అని అంటున్నారు. మరి ఏపీ వంటి అన్ని విధాలుగా కునారిల్లిన స్టేట్ ని అక్కున చేర్చుకుని ఎక్కువ నిధులు ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా ఏపీ జనాలు వేసిన ఓట్లతో సీట్లతో ఎన్డీయే నిలిచింది. అందువల్ల ఏపీకి ఎంతో చేస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు కాకుండా కాంక్రీట్ గా ఫలానా అని చెప్పి చేస్తే జనాలు సంతోషిస్తారు అని అంటున్నారు.