ఓవైపు మెగాస్టార్.. మరోవైపు పవర్ స్టార్.. నట్టనడుమ ప్రధాని!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు.
By: Tupaki Desk | 12 Jun 2024 9:52 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రమాణస్వీకారం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణాలు ముగియగానే ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై ఉన్న అతిరథ, మహారథులందరినీ పేరు పేరునా పలకరించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రధేశ్ లో ఎన్డీయే కూటమికి ఘనవిజయం చేకూర్చిపెట్టిన పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. పవన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఏదో అడగడం కనిపించింది. ఇందుకు పవన్.. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కూర్చున్న వైపు చూపిస్తూ మోదీతో మాట్లాడారు.
అంతేకాకుండా చిరంజీవిని పిలవడానికి పవన్ ముందుకు కదిలారు. మోదీని అక్కడే ఉండాలని.. తన సోదరుడిని పిలుస్తానని పవన్ చెప్పగా.. మోదీ సైతం చిరంజీవి ఉన్నవైపు రావడం విశేషం. పవన్ కళ్యాణ్.. చిరంజీవిని పిలిచి మోదీ వైపునకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉండగానే మోదీ స్వయంగా వీరిద్దరు ఉన్నచోటకు వచ్చేశారు.
అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆయన భుజంపై తట్టి అభినందించారు. అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి చేతులను తన చేతుల్లోకి తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పవన్ వైపు చూపిస్తూ చిరంజీవితో ఏదో చెప్పడం కనిపించింది. అందుకు పవన్ కళ్యాణ్ నమస్కారం చేయగా.. చిరంజీవి భావోద్వేగంతో తన సోదరుడు పవన్ కళ్యాణ్ బుగ్గలను ఆప్యాయంగా చేతితో తడిమారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను తనకు చెరోవైపు నుంచో పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరి చేతులను తన చేతుల్లోకి తీసుకుని.. ముగ్గురూ చేతులు పైకిపెట్టి ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై మెగాస్టార్.. జై పవర్ స్టార్ నినాదాలు మిన్నంటాయి. చిరంజీవి భావోద్వేగానికి, సంతోషానికి గురయ్యారు.
ఈ దృశ్యాన్ని కింద ఉండి వీక్షిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లద్దాలు పెట్టుకున్నా కళ్లల్లో తడి కనిపించింది. ఓవైపు ఆనందం, మరోవైపు భావోద్వేగం చుట్టుముడుతుండగా రామ్ చరణ్ ఆ దృశ్యం చూసి పరవశానికి గురయ్యారు. ఇక కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు ఈ దృశ్యాలను బంధించడానికి పోటీలు పడ్డారు.