మోదీ వంద రోజుల ప్లాన్.. రెండు కీలక రోడ్ ప్రాజెక్టులివే!
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 19 Jun 2024 12:30 PM GMTకేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వం, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వే నిర్మాణాలు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి.
ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో తొలి వంద రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. తొలి వంద రోజుల్లో ప్రారంభించాల్సిన పనుల్లో తెలంగాణకు చెందిన రెండు కీలక రోడ్ ప్రాజెక్టులు స్థానం దక్కించుకోవడం విశేషం.
మోదీ 3.0 తొలి ‘వంద రోజుల ప్రణాళిక’లో తెలంగాణలోని ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరసల జాతీయ రహదారుల ప్రాజెక్టులకు స్థానం లభించింది. దీంతో ఈ రెండు రోడ్ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగం పుంజుకోనున్నాయి.
కాగా ప్రధాని మోదీ తన తొలి వంద రోజుల ప్రణాళికకు దేశవ్యాప్తంగా 3 వేల కి.మీ. మేర జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రే వీటిని పర్యవేక్షిస్తుండటంతో యుద్ధప్రాతిపదికన ఈ 3 వేల కి.మీ రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి. ఇందులో తెలంగాణలోని ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరసల జాతీయ రహదారి ఉన్నాయి.
కాగా ఇప్పటికే ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముగిసింది. అలాగే జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు స్వయంగా ప్రధానే వీటిని పర్యవేక్షిస్తుండటం, తన వందరోజుల ప్రణాళికలో చేర్చడంతో వీటి పనులు వేగం పుంజుకోనున్నాయి.
నిజామాబాద్–ఛత్తీస్‌గడ్ లోని జగ్దల్ పూర్ మధ్య ఉన్న ఎన్‌హెచ్–63 ఘోర ప్రమాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా ఈ రహదారిలో భారీ ట్రక్కులు తిరుగుతుంటాయి. రోడ్డు రెండు వరుసలతో ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరగడం.. భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి. దీంతో ఈ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఎన్‌హెచ్ –63లో ఆర్మూరు–మంచిర్యాల మధ్య ప్రాంతం కూడా ఉంది.
ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా సాగే ఈ రోడ్డు నిడివి 131.8 కిలోమీటర్లు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అలాగే జగిత్యాల నుంచి కరీంనగర్, ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్–563లో కీలక భాగమైన 58.86 కి.మీ. రోడ్డును కూడా విస్తరించనున్నారు. ఈ రోడ్డు కూడా ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనులకు రూ.2,300 కోట్లవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి కావాల్సిన భూమిని సేకరిస్తున్నారు. దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరగనున్నాయి.