Begin typing your search above and press return to search.

మోడీతో పవన్...పదేళ్ల తరువాత ...!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్ళ తరువాత ఒక బహిరంగ సభలో వేదిక పంచుకోబోతున్నారు

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:58 PM GMT
మోడీతో పవన్...పదేళ్ల  తరువాత ...!
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్ళ తరువాత ఒక బహిరంగ సభలో వేదిక పంచుకోబోతున్నారు. మోడీ పవన్ అప్పట్లో అంటే 2014 ఎన్నికల ముందు మార్చి నెలలో ఏపీలో అనేక సభలలో పాలుపంచుకున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీ నాడు ఉన్నారు. తిరుపతి విశాఖ తదితర సభలలో మోడీతో పాటు జనసేన అధినేత హోదాలో పవన్ హాజరయ్యారు.

మోడీతో పవన్ వేదిక మీదనే మాట్లాడిన సందర్భాలు నాడు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత మాత్రం ఈ ఇద్దరూ ఓపెన్ గా ఎక్కడా సభలలో కనిపించలేదు. ఇక గత ఏడాది అక్టోబర్ లో విశాఖ వచ్చిన ప్రధాని మోడీ పవన్ని రప్పించుకుని ముఖా ముఖీ భేటీ నిర్వహించారు. ఇక ఈ ఏడాదిలో ఢిల్లీకి పవన్ ని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ బీజేపీ పెద్దలు ఎండీయే భేటీలో కూర్చోబెట్టుకున్నారు.

అలా ప్రధాని మోడీతోనూ బీజేపీతోనూ పవన్ బంధం పటిష్టంగానే కొనసాగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ నెల 7న హైదరాబద్ లోని ఎల్బీ స్టేడియం లో జరిగే సభలో మోడీ తో పాటు పవన్ ఒకే వేదిక మీద కనిపించనున్నారు. ఈ సభను సూపర్ హిట్ చేయాలని బీజేపీ భావిస్తోంది.

దాదాపుగా లక్ష మందితో ఈ సభ నిర్వహించాలని చూస్తోంది. బీసీ ఆత్మగౌరవ సభగా దీన్ని నిర్వహిస్తునారు. ఇక మోడీ అంటేనే ఒక అట్రాక్షన్. దానికి పవన్ కూడా తోడు కానున్నారు. దాంతో ఈ సభ బీజేపీ తరఫున సంపూర్ణంగా విజయవంతం అవుతుంది అని భావిస్తున్నారు.

ఇదే సభలో ప్రధాని మోడీ అయితే కాంగ్రెస్ బీయారెస్ ల మీద నిప్పులు చెరుగుతారు అని అంటున్నారు. మరి పవన్ ఈ సభలో ఏమి మాట్లాడుతారు అన్నది ఆసక్తికరంగా ఉంది. ఆయన సినీ నటుడు. పైగా బీయారెస్ నేతలు ఆయన సినిమా సభలకు వచ్చి మంచిగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

దాంతో బీయారెస్ మీద పవన్ గట్టిగా విమర్శలు చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఒకవేళ చేస్తే ఎలాంటి రియాక్షన్ బీయారెస్ నుంచి వస్తుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. పవన్ ఏపీలో అయితే సభలలో ఒక లెవెల్ లో వైసీపీ మీద విరుచుకుపడతారు. అదే ఆయన స్పీచులకు అట్రాక్షన్ గా ఉంటుంది.

మరి ఆ ఆవేశం ఇపుడు చూపిస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా మోడీతో పవన్ సభ అంటే రోటీన్ గా సాగుతున్న తెలంగాణా ఎన్నికల ప్రచారంలో కొత్త మెరుపు గానే చూస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అంతా ఈ సభ మీద ఆసక్తిని కనబరచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సభ విజయవంతం అయ్యే దాన్ని బట్టి జనసేన టీడీపీ పొత్తు ఏ విధంగా జనంలో రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది ఆధారపడి ఉంది అని అంటున్నారు.