Begin typing your search above and press return to search.

కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా నెగ్గాలి!

ఛత్తీస్ గఢ్ వయా మధ్య్రప్రదేశ్.. టు రాజస్థాన్.. తెలంగాణ.. మధ్యలో ఢిల్లీ.. వీలైతే మరో రాష్ట్రం.. షెడ్యూల్ లో ఉంటే ఓ విదేశీ టూర్.. ఇదీ ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితి

By:  Tupaki Desk   |   3 Oct 2023 8:17 AM GMT
కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా నెగ్గాలి!
X

ఛత్తీస్ గఢ్ వయా మధ్య్రప్రదేశ్.. టు రాజస్థాన్.. తెలంగాణ.. మధ్యలో ఢిల్లీ.. వీలైతే మరో రాష్ట్రం.. షెడ్యూల్ లో ఉంటే ఓ విదేశీ టూర్.. ఇదీ ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను హెలికాప్టర్ లో ఆయన చుట్టేస్తున్నారు. అది ఎంతగా అంటే.. వారంలో రెండేసిసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఉత్తగా వెళ్లడమే కాదు.. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో రూ.వేల కోట్ల డెవలప్ మెంట్ నిధులు ప్రకటిస్తున్నారు.

ఇప్పుడు ఓడితే.. 2024లో అంతే

వచ్చే రెండు నెలల్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. అదికూడా దొడ్డిదారిన దక్కించుకున్నదే. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. మొన్నటివరకు గట్టిగా పోటీ పడిన తెలంగాణలో ఇప్పుడు మూడోస్థానమే అన్నట్లుంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ లను దక్కించుకోవడం బీజేపీకి ముఖ్యంగా మోదీకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. 2024లో లోక్ సభ సాధారణ ఎన్నికలు ఉన్నందున ఒకవిధంగా ఈ రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్స్ కింద లెక్కనే.

కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా నెగ్గాలి..

వచ్చే రెండు నెలల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ తో పాటు మిజోరంలోనూ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వీటిలో కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా గరిష్ఠంగా మూడింటిలోనైనా బీజేపీ గెలవాలి. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో. లేదంటే.. ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో 2024లో సాధారణ ఎన్నికలకు బీజేపీకి కష్టకాలమే.

పరిస్థితులు ప్రతికూలమే..

ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి కచ్చితంగా గెలిచే అవకాశం ఎందులోనూ కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు విఫలమైందనే భావన బలంగా ఉంది. రెండు విడతల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లో మళ్లీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నిటికిమించి తెలంగాణలోనూ కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. అందుకే మోదీకి కాలికి బలపం కట్టుకుని ఈ రాష్ట్రాలను చుట్టివస్తున్నారు.

వారంలో రెండుసార్లు

మోదీ అవిశ్రాంతంగా పనిచేస్తారు. 73 ఏళ్ల వయసులోనూ హుషారుగా కనిపిస్తున్నారు. అయితే, ప్రధానిగా అత్యత బిజీ షెడ్యూల్ ఉండే ఆయన దానిని సమన్వయం చేసుకుంటూనే, ఎన్నికల రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. గత సోమవారం మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో వెంటవెంటనే పర్యటించారు. ఈ నెల 1న తెలంగాణకు వచ్చారు. మళ్లీ మంగళవారం నిజామాబాద్ లో సభలో పాల్గొంటున్నారు. అటునుంచి ఛత్తీస్ గఢ్ కు వెళ్తున్నారు. దీన్నిబట్టే.. వచ్చే ఎన్నికలకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టమవుతోంది.

కొసమెరుపు..: ఎన్నికల పుణ్యమాని.. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు మోదీ వరాలు ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ ప్రతిపాదన దాదాపు పదేళ్లుగా పెండింగ్ లో ఉంది. దానిని మొన్న మంజూరు చేసేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం 12 ఏళ్లుగా నలుగుతోంది. బీజేపీ ఎంపీ అర్వింద్ గత ఎన్నికల్లో బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ఇక ఏర్పాటు కలే అనుకుంటుండగా.. మోదీ మొన్న మంజూరు చేశారు. ఇలానే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోనూ రూ.వేల కోట్ల పథకాలను ప్రకటిస్తూ ప్రారంభిస్తూ ప్రధాని మోదీ ఎన్నికల హంగామా చేస్తున్నారు.