మోడీ స్పీడే వేరు: 10 రోజులు 12+ రాష్ట్రాలు..29 ప్రోగ్రాంలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
By: Tupaki Desk | 4 March 2024 5:56 AM GMTసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హ్యాట్రిక్ విజయంతో పాటు మిత్రపక్షాలతో కలిసి 400 ప్లస్ సీట్లను సాధించాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన సరంజామాను పక్కాగా సిద్ధం చేసుకున్న ఆయన.. తన ప్లాన్ లో భాగంగా ఒక దాని తర్వాత మరొకటి చొప్పున పనుల్ని చేసుకుంటూ వెళుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన అంతకు ముందే వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు తెర తీశారు.
వచ్చే పది రోజుల వ్యవధిలో ఆయన 12 రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మొత్తం29 కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. తెలంగాణలో మొదలయ్యే ఆయన పర్యటన.. తమిళనాడు.. ఒడిశా.. పశ్చిమ బెంగాల్.. జమ్ముకశ్మీర్.. అసోం.. అరుణాచల్ ప్రదేశ్.. ఉత్తరప్రదేశ్.. గుజరాత్.. రాజస్థాన్.. ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటిస్తారని చెబుతున్నారు.
ఈ రోజు (సోమవారం) నుంచి తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. హ్యాట్రిక్ ప్రధానిగా రికార్డుల్లోకి ఎక్కాలని తపిస్తున్న మోడీ.. అందుకు తగ్గట్లే భారీ ప్లానింగ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. వికసిత్ భారత్ 2047 పేరుతో ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయటమే కాదు.. దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. తాజాగా కేంద్ర మంత్రులకు ప్రజంటేషన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మూడోసారి తాము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లే ఏమేం చేయాలన్న దానిపై కార్యాచరణనను సిద్ధం చేశారు.
ఈ బ్లూప్రింట్ కోసం భారీగా కసరత్తు సాగింది. గడిచిన రెండున్నరేళ్లలో దేశంలోని వివిధ స్థాయిల్లో 2700 సమావేశాలు.. వర్కుషాపులు.. సెమినార్లు నిర్వహించారు. దాదాపు 20 లక్షల మంది యువతీ యువకుల నుంచి సలహాలు.. సూచనలు తీసుకొని దేశ డెవలప్ మెంట్ కోసం.. సులభతర జీవనం.. సులభతర వాణిజ్యం లాంటి అంశాలపై ఫోకస్ చేయాలన్నది లక్ష్యమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 370-400 సీట్లు ఖాయంగా గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏమైనా పదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి కూడా.. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో పాటు.. అందుకు అవసరమైన ముడిసరుకుల్ని సమకూర్చుకునే విషయంలో మోడీకి సాటి వచ్చే వారెవరూ ఉండన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా చూసుకోవటంలో ముందంజలో ఉన్నారని చెప్పక తప్పదు.