Begin typing your search above and press return to search.

నెహ్రూ, ఇందిర, వాజ్ పేయీ.. వీరి సరసన ఆయన నిలుస్తారా?

వీరందరిలోనూ ముగ్గురిది మాత్రం ఇప్పటివరకు చెరగని రికార్డు. మరి వారిని అందుకోగల నేత ఉన్నారా?

By:  Tupaki Desk   |   11 May 2024 4:30 PM GMT
నెహ్రూ, ఇందిర, వాజ్ పేయీ.. వీరి సరసన ఆయన నిలుస్తారా?
X

అత్యంత ప్రజాదరణ ఉన్న జవహర్ లాల్ నెహ్రూ నుంచి అసలు ప్రజలకు పరిచయమే లేని ఐకే గుజ్రాల్ వరకు భారత దేశానికి చాలా మంది ప్రధాన మంత్రులుగా పనిచేశారు. అత్యంత శక్తిమంతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ మొదలు.. రాజనీతి గల నాయకుడిగా మన్ననలు పొందిన వాజ్ పేయీ దాక ఇంకా పలువురు ప్రధానులుగా బాధ్యతలు నిర్వర్తించారు. మండల్ కమిషన్ తో బీసీలకు రిజర్వేషన్లు అందించిన వీపీ సింగ్.. మైనారిటీ ప్రభుత్వంలోనూ అత్యంత సంచలనమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ఐదేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారు. ఇంకా చెప్పాలంటే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ఎవరి ప్రత్యేకత వారిది. వీరందరిలోనూ ముగ్గురిది మాత్రం ఇప్పటివరకు చెరగని రికార్డు. మరి వారిని అందుకోగల నేత ఉన్నారా?

స్వాతంత్ర్యం నుంచి తుదిశ్వాస వరకు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి తుది శ్వాస విడిచిన 1964 మే 27 వరకు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు జవహర్ లాల్ నెహ్రూ. అంతేకాదు.. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. అత్యధిక కాలం.. 16 ఏళ్ల 9 నెలల 14 రోజులు ప్రధాని కొనసాగారు. 1952, 1957, 1962లో నెహ్రూ మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.

నాన్న బాటలో కూతురు

స్వాతంత్ర్య భారత చరిత్రలో తొలి మహిళా, ఇప్పటివరకు ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినా.. తదనంతర కాలంలో తనదైన ముద్ర వేశారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో ఇందిరా 1966లో తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. 1967లో రెండోసారి,1971లో మూడోసారి దేశ అత్యున్నత పదవిని అలంకరించారు. 1980లో నాలుగోసారి గెలిచి ప్రధాని అయ్యారు. తండ్రిని మించి అత్యధిక సార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. మొత్తం 15 ఏళ్ల 11 నెలల 17 రోజులు ప్రధానిగా ఉన్నారు.

చెరగని ముద్ర వాజ్ పేయీ

బీజేపీని మతతత్వ పార్టీగా మిగతా పార్టీలన్నీ దూరం పెడుతున్న రోజుల్లో తనదైన వ్యక్తిత్వంలో ప్రాంతీయ పార్టీలను ఆకర్షించారు అటల్ బిహారీ వాజ్ పేయీ. ఈయన కూడా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. 1996 మే 16 నుంచి జూన్ 1 వరకు తొలిసారి ప్రధాని పీఠం అధిష్ఠించారు. 1998లో రెండోసారి కూడా బాధ్యతలు చేపట్టారు. తొలిసారి 13 రోజులు, రెండోసారి 13 నెలలు మాత్రమే పదవిలో కొనసాగారు. 1999లో నెగ్గి మూడోసారీ ప్రధాని అయ్యారు. అయితే, ఈసారీ పూర్తి టర్మ్ పదవిలో లేకపోవడం గమనార్హం. ముందుస్తు ఎన్నికలకు వెళ్లి పరాజయం పాలవడంతో ఐదేళ్ల టర్మ్ పూర్తి చేయలేకపోయారు.

మన్మోహన్ రికార్డుకు మోదీ ఎసరు

2004లో అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ 2014 వరకు పదేళ్ల 4 రోజులు ఆ బాధ్యతల్లో ఉన్నారు. కాంగ్రెస్ లో గాంధీయేతర ప్రధాని ఇంతకాలం పదవిలో ఉండడం ఓ రికార్డే. ఇక ఆ తర్వాత మొదలైంది మోదీ శకం. 2014 మే 26న మోదీ ప్రధాని అయ్యారు. ఈ జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అప్పటికి ఆయన పదేళ్ల పది రోజులు ప్రధానిగా ఉన్నట్లు అవుతుంది. అంటే.. మన్మోహన్ రికార్డును చెరిపేసి, నెహ్రూ, ఇందిర తర్వాత అత్యధిక కాలం భారత ప్రధానిగా ఉన్న నాయకుడు కాబోతున్నారు.

మరి మూడో టర్మ్..?

హ్యాట్రిక్ ఖాయమంటూ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రచారం చేస్తున్నారు. మరోసారీ తానే ప్రధాని అంటున్నారు. అదే జరిగి.. వచ్చే ఐదేళ్లూ పదవిలో ఉంటే 15 ఏళ్లకు పైగా ప్రధానిగా కొనసాగినట్లు. అయితే, నెహ్రూ, ఇందిర, వాజ్ పేయీ మాత్రమే మూడుసార్లు ప్రధానులుగా ప్రమాణం చేశారు. మన్మోహన్, మోదీ రెండుసార్లు ప్రమాణం చేశారు. ‘మూడోసారి’ ఘనతను అందుకునే చాన్స్ మోదీకి ఉందా? లేదా? అనేది జూన్ 4న వెలువడే ఫలితాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి నిర్ణయాన్ని కాలానికే వదిలేద్దాం.