ఏపీకీ మోడీ ప్రయారిటీ.. ఆరు మంత్రి పదవులు!
టీడీపీ నుంచి నలుగురికి.. జనసేన, బీజేపీ నుంచి ఒక్కరు చొప్పున కేంద్ర మంత్రులుగా పదవి చేపట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 9 Jun 2024 8:55 AM GMTకేంద్రంలో కొత్తగా కొలువుదీరనున్న మోడీ ప్రభుత్వంలో ఈ సారి ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రాధాన్యత దక్కే అవకాశముంది. వరుసగా మూడో సారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో ఏపీలోని టీడీపీ కీలక పాత్ర పోషించడమే అందుకు కారణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఈ సారి మోడీ కేబినేట్‌లో ఏకంగా ఆరుగురు మంత్రులకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి నలుగురికి.. జనసేన, బీజేపీ నుంచి ఒక్కరు చొప్పున కేంద్ర మంత్రులుగా పదవి చేపట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లే లక్ష్యంగా సాగిన ఎన్డీయే కూటమి అనుకున్నది సాధించలేకపోయింది. మరోవైపు బీజేపీ కూడా గతంలో కంటే 63 స్థానాలు కోల్పోయి 240 సీట్లకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎన్డీయే మిత్రపక్షాల సహకారం అవసరమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఇందులో కీలకంగా మారింది. 2 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించిన జనసేన కూడా కూటమిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అందుకే ఈ సారి ఏపీకి మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ సారి మోడీ కేబినేట్‌లో ఏపీ నుంచి ఆరుగురు మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ తరపున రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస్‌కు కేంద్ర మంత్రి పదవి ఖాయమైంది. మోడీతో పాటు వీళ్లూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత కేబినేట్ విస్తరణలో భాగంగా టీడీపీకి మరో రెండు పదవులు దక్కే అవకాశముంది. జనసేన నుంచి వల్లభనేని బాలశౌరికి ఛాన్స్ దక్కొచ్చని తెలిసింది.