మోదీ టూర్ కు ముందు.. రష్యా-ఉక్రెయిన్ రణ గర్జన.. ఏం జరుగునో?
ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లారు.
By: Tupaki Desk | 8 July 2024 11:08 AM GMTముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లారు. గత నెలలోనే జి7 దేశాల కూటమి సమావేశం కోసం స్విట్జర్లాండ్ లో పర్యటించినా.. అది ద్వైపాక్షిక పర్యటన కాదు. కేవలం జి-7 ఆహ్వానిత దేశ ప్రధానిగా పాల్గొన్నారు. ఇక ఇప్పటివరకు 70కి పైగా దేశాల్లో భారత ప్రధానిగా మోదీ పర్యటించారు. మూడో విడతలో మాత్రం తొలి పర్యటనలోనే వివాదాస్పద దేశానికి వెళ్తున్నారు.
మోదీ కాలు పెట్టే వేళ
మోదీ సోమవారం నుంచి రష్యాలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన రష్యా చేరుకున్నారు. మోదీ పర్యటన ఎంతో ముఖ్యమైనదని, పూర్తి స్థాయిలో సాగుతుందని రష్యా చెబుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ చర్చించనున్నారు. మంగళవారం కూడా రష్యాలోనే ఉండే మోదీ ఆ తర్వాత ఆస్ట్రియా వెళ్తారు. మోదీని పుతిన్ స్వయంగా ఆహ్వానించారు. మోదీ మూడో విడత ప్రధాని కావడానికి సరిగ్గా నెల ముందు రష్యాకు పుతిన్ మరోసారి అధ్యక్షుడు అయ్యారు. ఇక 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టిన తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు 2019లో మోదీ రష్యా వెళ్లారు.
రష్యాకు తలనొప్పి..
మోదీ పర్యటన ముంగిట రష్యాను ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే రష్యా దాడులను రెండున్నరేళ్లుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. ఇప్పుడు డ్రోన్లు, క్షిపణులతో ఎదురుతిరుగుతోంది. రెండు రోజుల కిందట ఓ మందుగుండు గోదాంపై దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో వొరోనెజ్ ప్రాంతంలో పలుచోట్ల అత్యవసర స్థితి విధించారు. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ పేలుడు పదార్థాలు మండుతూనే ఉన్నాయి.
మరోవైపు ఉక్రెయిన్ ను చీకట్లో ఉంచడమే లక్ష్యంగా రష్యా కొంతకాలంగా విద్యుత్తు వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. తమ సరిహద్దులోని సుమి ప్రావిన్సుపై ఇటీవల వైమానిక దాడులు చేయడంతో లక్షల మంది చీకట్లో మగ్గిపోయారు. సుమి ప్రావిన్సు రాజధానికి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో రష్యాకు బుద్ధి చెప్పేందుకు ఉక్రెయిన్.. వొరోనెజ్ ప్రాంతంపై డ్రోన్లతో విరుచుకుపడింది. మందుగుండు సామగ్రి ఉన్న గోదాములో మంటలు చెలరేగాయి.
ఉక్రెయిన్ పై మోదీ ఏం చెబుతారో?
రెండేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎవరి వైపునా నిలవలేదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. ఇది యుద్ధాల కాలం కాదని మోదీ చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ కీలక విషయాల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్నది. మరిప్పుడు యుద్ధం మొదలయ్యాక మోదీ తొలిసారి రష్యా పర్యటనకు వెళ్లారు. అక్కడినుంచి ఏమని చెబుతారో?