మోడీ షర్మిలను ప్రమోట్ చేశారా...!?
ప్రధాని స్థాయి వ్యక్తులు సాధారణంగా ప్రత్యర్ధులను విమర్శించాలంటే వారి స్థాయి తాహతు చూస్తారు
By: Tupaki Desk | 18 March 2024 9:39 AM GMTప్రధాని స్థాయి వ్యక్తులు సాధారణంగా ప్రత్యర్ధులను విమర్శించాలంటే వారి స్థాయి తాహతు చూస్తారు. నరేంద్ర మోడీ ఎపుడూ ఈ విషయంలో రాజకీయ కొలమానాలను అసలు మరచిపోరు. అలాంటి నరేంద్ర మోడీ ఏపీలో తొలిసారి ఎన్డీయే కూటమి నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కొంత వింతగా విచిత్రంగా ఉన్నాయి.
ఆయన ఏపీలో వైసీపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు నాయకత్వాలు వహిస్తున్నది ఒకే కుటుంబానికి చెందిన వారు అని కామెంట్స్ చేశారు. వైసీపీకి జగన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ కి కొత్తగా షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. ఈ రెండూ కలిపేసి మోడీ కాంగ్రెస్ వైసీపీ ఒక్కటే అని అంటున్నారు.
నిజానికి తెలుగు రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తున్న వారికి అలాంటిది ఏదీ లేదని అర్ధం అవుతుంది. షర్మిలకు జగన్ కి విభేదాలు ఉన్నాయని అంతా నమ్ముతున్నారు. అయితే అది అంతా నిజం కాదు, మభ్యపెట్టడానికే ఎన్డీయే ఓట్లను చీల్చడానికే అని మోడీ కొత్త రాజకీయ విశ్లేషణ చేశారు.
అసలు ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అన్నది చర్చకు వస్తోంది. అయితే మోడీ ఈ నెల 15 నుంచి తెలుగు రాష్ట్రాలలోనే పర్యటిస్తున్నారు. ఆయన ఈ నెల 15న తెలంగాణా పర్యటనలో ఉన్నపుడు ఏపీలో విశాఖలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి భారీ మీటింగ్ పెట్టి మరీ మోడీ సర్కార్ మీద నిప్పులు చెరిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆ సభ జరిగింది. అదే సభలో షర్మిల కూడా మోడీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు.
అది మోడీ దృష్టిలో ఉందని అంటున్నారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏ ఒక్క పార్టీ ఈ రోజుకీ మాట్లాడటం లేదు. అలాంటిది ఎక్కడో ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ లేచి కూర్చుని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ సర్కార్ ని గద్దించినది. అదే విధంగా అంతా మరచిపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ ముందుకు తెస్తోంది.
మీడియా విషయంలో తమ పార్టీకి వ్యతిరేకంగా ఏ కామెంట్ వచ్చినా బీజేపీ ఫుల్ అలెర్ట్ గా ఉంటుంది. అందునా ప్రధాని తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి షర్మిల కలసి నిర్వహించిన బహిరంగ సభకు ఏపీలోనే మోడీ జవాబు చెప్పారని అంటున్నారు. అయితే అది డైరెక్ట్ గా కాకుండా జగన్ తో ముడిపెట్టి చెప్పారని అంటున్నారు.
బీజేపీ పాలసీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. బీజేపీ నిర్ణయం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నది. అలాంటి అంశాల మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడకపోయినా కాంగ్రెస్ ఇటీవల కాలంలో ప్రస్తావిస్తోంది. అది అంతకంతకు జనంలోకి వెళ్తే బీజేపీతో పాటుగా ఎన్డీయే కూటమి ఓట్లకే ప్రమాదం.
అందుకే కాంగ్రెస్ కి హైప్ క్రియేట్ కాకుండా ఉండాలంటే ఏమి చేయాలన్నది చూసుకుని మరీ వైసీపీతో కుమ్మక్కు అంటూ ముడిపెట్టేశారు ప్రధాని. ఇదిలా ఉంటే ఆయన దృష్టిలో కాంగ్రెస్ అంటే ఏపీ కాంగ్రెస్ కాదు, కేంద్ర కాంగ్రెస్. అయితే ఏపీకి షర్మిల చీఫ్ గా ఉన్నారు. కాబట్టి ఆమె రియాక్ట్ అయ్యారు. ఒక విధంగా ఆమెకు మోడీ విమర్శలు కొంత బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయి.
ఏపీలో కాంగ్రెస్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆమె చేసే కామెంట్స్ కి గతంలో వైసీపీ రియాక్ట్ అయ్యేది. ఇపుడు ఆ పార్టీ కూడా లైట్ తీసుకుంటోంది. ఈ నేపధ్యంలో ఒక దేశ ప్రధాని వచ్చి చేసిన కామెంట్స్ తో షర్మిలకు హుషార్ వచ్చింది అని అంటున్నారు. అదే సమయంలో వెంటనే ఖండించాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే ఆమె విశ్వసనీయతకు ఇబ్బంది వస్తుంది.
మొత్తానికి మోడీ జగన్ ని విమర్శించాలని ఉన్నా ఇండైరెక్ట్ గా అన్నారు. అలాగే కాంగ్రెస్ ని వాడుకున్నారు. ఫలితంగా మోడీకి వైసీపీ నుంచి విమర్శలు రాలేదు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చాయి. ఏది ఏమైనా చూస్తే ఏపీలో వన్ పర్సెంట్ కూడా లేని కాంగ్రెస్ కి మోడీ ఫ్రీగా ప్రచారం చేసి మేలు చేశారు అని అంటున్నారు.
ఎన్డీయే ఓట్లు కాదు కదా ఏ ఓట్లూ చీల్చే శక్తి ఇప్పటికీ కాంగ్రెస్ లేదు అని అంతా అంటారు. కానీ కాంగ్రెస్ బూచిని మోడీ చూపించడమే చిత్రంగా ఉంది అని అంటున్నారు. ఇది వైఎస్ షర్మిలకు కూడా ఒక లీడర్ గా ప్రమోట్ అయ్యేలా మోడీ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.